సీఎంకు వినతుల వెల్లువ
చెళ్లకెరె రూరల్ : కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శుక్రవారం పట్టణంలోని నెహ్రూ సర్కిల్ వద్ద రైతు సంఘం పదాధికారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రముఖుడు భూతయ్య మాట్లాడుతూ... తాలూకాలో ఎలాంటి శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెరువులకు నీటిని అందించే భద్రా ఎత్తిపోతల పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు. 2015లో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించలేదని, వెంటనే రైతుల పంటల బీమా మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకు అధికారులకు ఆదేశించాలని కోరారు. పురసభ మాజీ సభ్యుడు ఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... తాలూకాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు.
దీంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని తాలూకాకు తాగునీటి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి తాలూకాలోని దొడ్డ ఉళ్లార్తి గ్రామానికి వెళ్లి గ్రామంలోని గోశాలను పరిశీలించారు. తాలూకాలోని హీరేహళ్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలి కార్మికుల సమస్యలను వినకుండా వెళుతున్న ముఖ్యమంత్రిపై ఉపాధి హామి కూలీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి హామీ కూలీ బకాయిలను అధికారులు చెల్లించలేదని కూలీ కార్మికుడు తిప్పేశ్ ముఖ్యమంత్రికి ఆరోపించారు.