Chief Minister siddaramayya
-
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
బెంగళూరు: వివిధ దేశాల్లోని భారత రాయబారులు దేశ అభివృద్ధితో పాటు కర్ణాటక అభివృద్ధికి సైతం సహకారాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. నెదర్ల్యాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, ఐర్ల్యాండ్, కొరియా, మొజాంబిక్ దేశాల్లో భారత రాయబారులతో సీఎం సిద్ధరామయ్య గురువారమిక్కడి క్యాంపు కార్యాలయం కృష్ణాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రపంచ దేశాలకు భారత్‌ను పరిచయం చేయడంతో పాటు ఇక్కడున్న అవకాశాల గురించి తెలియజెప్పాలని కోరారు. అదే సందర్భంలో కర్ణాటకలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సైతం తెలియజేసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుతం కర్ణాటక దేశంలోనే మూడో స్థానంలో ఉందని వారికి వివరించారు. రానున్న పదేళ్లలో రాష్ట్రంలో రెండు ప్రముఖ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లాలో దేశంలోనే అతిపెద్దదైన ఉత్పదనా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు భారత రాయబారులకు సీఎం సిద్ధరామయ్య వివరించారు. -
సీఎంకు వినతుల వెల్లువ
చెళ్లకెరె రూరల్ : కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శుక్రవారం పట్టణంలోని నెహ్రూ సర్కిల్ వద్ద రైతు సంఘం పదాధికారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రముఖుడు భూతయ్య మాట్లాడుతూ... తాలూకాలో ఎలాంటి శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెరువులకు నీటిని అందించే భద్రా ఎత్తిపోతల పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు. 2015లో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించలేదని, వెంటనే రైతుల పంటల బీమా మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకు అధికారులకు ఆదేశించాలని కోరారు. పురసభ మాజీ సభ్యుడు ఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... తాలూకాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని తాలూకాకు తాగునీటి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి తాలూకాలోని దొడ్డ ఉళ్లార్తి గ్రామానికి వెళ్లి గ్రామంలోని గోశాలను పరిశీలించారు. తాలూకాలోని హీరేహళ్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలి కార్మికుల సమస్యలను వినకుండా వెళుతున్న ముఖ్యమంత్రిపై ఉపాధి హామి కూలీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి హామీ కూలీ బకాయిలను అధికారులు చెల్లించలేదని కూలీ కార్మికుడు తిప్పేశ్ ముఖ్యమంత్రికి ఆరోపించారు. -
నేడు బళ్లారి జిల్లాకు సీఎం సిద్ధరామయ్య రాక
► కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు ► బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు సాక్షి, బళ్లారి : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి జిల్లాకు రానున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి, స్వయంగా కరువు ప్రాంతాలను పర్యటించేందుకు సీఎం సోమవారం బళ్లారి జిల్లాకు రానున్న నేపథ్యంలో బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించి, రైతులతో సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీంతో బళ్లారి జిల్లా అధికారులు సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బళ్లారి నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సీఎం ఉంటున్న సందర్భంగా ఆయా గ్రామాలతో బళ్లారి నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను స్వయంగా తిలకించేందుకు సీఎం విచ్చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రైతులపై ఏమైనా వరాల జల్లు కురిస్తారా?లేదా? ఇలా వచ్చి అలా వెళ్లి పోతారా? అని రైతుల్లో సంశయం నెలకొంది. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వం తూతూమంత్రంగా స్పందించింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరువు నివారణ, రైతులను ఆదుకోవడంలో చొరవ చూపలేదు. అయితే సీఎం జిల్లాకు రానున్న సందర్భంగా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఏ మేరకు తమను ఆదుకుంటారన్నది రైతులు ఎదురు చూస్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. నేడు పలు రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపు బళ్లారి టౌన్ : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి నగరానికి రానున్నందున పలు రోడ్ల ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నగరంలోని కౌలుబజార్ రోడ్డు మొదటి గేటు, సుధా క్రాస్, రేడియో పార్కు, ఎస్పీ సర్కిల్, మోతీ సర్కిల్, ఇందిరా సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుందని, ప్రజలు ఈ విషయం గమనించి సహకరించాలని తెలిపారు. -
ముఖ్యమంత్రి మార్పు ప్రసక్తే లేదు
మంత్రి రామలింగారెడ్డి కోలారు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పూర్తి కాలం అదే పదవిలో కొనసాగుతారని జిల్లా ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... సిఎం సిద్దరామయ్య ఉత్తమ పరిపాలన అందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ నాయకులు అకారణంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష తనకు కూడా ఉందని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఆంజనేయులు, జనార్దన పూజారి మధ్యన జరిగిన మాటల యుద్ధంపై స్పందించిన మంత్రి నాలుగు గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం వీధికెక్కడం మంచిది కాదన్నారు. కేపీసీసీ పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం ఇష్టమన్నారు. ఎంపీ కేహెచ్ మునియప్ప అనుభవం దృష్ట్యా ఆయన ఆ పదవికి అర్హుడన్నారు. అదే విధంగా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే రూ. 4 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. బెంగుళూరులోని చెత్తను కేజీఎఫ్‌లో వేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
మార్పా.. ప్రక్షాళనా..?
కాంగ్రెస్ నేతల్లో తీవ్ర చర్చ పార్టీ కోసం శ్రమించిన వారిని పట్టించుకోవడం లేదు : అసంతృప్తుల ఆవేదన దిగ్విజయ్ సింగ్‌తో భేటీకి సన్నద్ధం బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పా లేక మంత్రివర్గ ప్రక్షాళన అన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆ పీఠం నుంచి తప్పించాలంటూ సీనియర్ నేతలు హైకమాండ్‌కు విన్నవిస్తుండగా, మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లో మునిగిపోయారు. దీంతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖకు చెందిన ముఖ్య నేతలు ఆయనతో బుధవారం భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు, మంత్రి వర్గ పునర్నిర్మాణం తదితర అంశాలపై దిగ్విజయ్ సింగ్ వీరితో చర్చించనున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో పాటు ఆస్కార్ ఫెర్నాండెజ్, జాఫర్ షరీఫ్ తదితరులు ఇప్పటికే ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్‌ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, పార్టీ కోసం శ్రమించిన వారిని, జేడీఎస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన సీఎం సిద్ధరామయ్య పట్టించుకోవడం లేదన్నది వీరి వాదన. తమ అభిప్రాయాలు, సలహాలను సిద్ధరామయ్య పరిగణలోకి తీసుకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వీరంతా గుర్రుగా ఉన్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం తన పదవికే ముప్పు వ చ్చే సమయంలో అసంతృప్త నేతలందరినీ కలుపుకొని పోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు వేసవిలో ఎండవేడిమి కంటే ఎక్కువగా సెగ రగిలిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
లీకేజీ కారకులు తప్పించుకోలేరు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: పీయూసీ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరించారు. లీకేజీకి పాల్పడిన వారు ఎంత ప్రాబల్యం కలిగిన వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంగళవారమిక్కడి విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాలార్పణ చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శర ణ ప్రకాష్ పాటిల్ పీఏ లీకేజీ వ్యవహారంలో భాగస్వామిగా మారిన వైనం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అతడిని ఇప్పటికే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఇక చట్టం ఎదుట ఎవరూ పెద్దవారు కాదని, లీకేజీ వ్యవహారంలో భాగస్వాములైన వారందరినీ శిక్షించి తీరతామని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రి వర్గ పునఃనిర్మాణానికి సంబంధించి హైకమాండ్‌తో చర్చించేందుకు గాను త్వరలోనే ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. -
బడ్జెట్ తర్వాత మంత్రి వర్గ విస్తరణ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోదన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారమిక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జిల్లా, తాలూకా పంచాయితీ ఎన్నికలు వరుసగా రావడంతో మంత్రి వర్గ విస్తరణను చేపట్టలేక పోయామని అన్నారు. ప్రస్తుతం అన్ని ఎన్నికలు పూర్తై నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. మంత్రి వర్గ విస్తరణకు ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ పెద్దలను కలిసి చర్చిస్తానని, ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణను చేపడతామని తెలిపారు. -
ఎత్తిన హోళే రసాభాస
రైతు నాయకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అర్ధంతరంగా సమావేశం నుంచి నిష్ర్కమించిన వీరప్ప మొయిలీ పోరాటం ఆగదు : ప్రభుత్వాన్ని హెచ్చరించిన కోడిహళ్లి చంద్రశేఖర్ బెంగళూరు: కోలారు, చిక్కబళాపుర జిల్లాలకు శాశ్వత తాగు, సాగునీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన ఎత్తినహోళే పథకం విషయంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం రసాభసగా ముగిసింది. రైతుసంఘం నాయకులు, రైతులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సమావేశం మధ్యలోనే పార్లమెంటు సభ్యుడు వీరప్పమొయిలీ వెళ్లిపోవడం గమనార్హం. కోలారు, చిక్కబళాపుర తదితర మైదాన ప్రాంత జిల్లాల్లో నీటి కష్టాలను తీర్చాలని కోరుతూ మూడు రోజుల ముందు ఆయా ప్రాంత రైతులు బెంగళూరుకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంత రైతులతో ఆదివారం తాను ప్రత్యేకంగా సమావేశమమై వారి అనుమానాలను తీరుస్తానని శాసనసభలో రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిసిద్ధరామయ్య అధ్యక్షతన ఆయా జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రైతు సంఘం నాయకులు క్యాంపు కార్యాలయం ‘కృష్ణ’లో ఎత్తినహోళే విషయమై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటగా మాట్లాడుతూ...‘నేను కూడా రైతు బిడ్డను... రైతుల కష్టాలు నాకు తెలుసు. మైదాన ప్రాంత జిల్లాలకు నీటి కష్టాలను తీర్చడానికి ఉద్దేశించిన ఎత్తినహోళే పథకం అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం కోసం కేటాయించిన రూ.32 వేల కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చుబెట్టాం. పనులు పూర్తయితే 24 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది.’ అని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కలుగ జేసుకున్న రైతు సంఘం నాయకులు ఎత్తినహోళే వల్ల కేవలం అందుబాటులోకి వచ్చే 24 టీఎంసీల నీరు మైదానప్రాంత జిల్లాలోని ప్రస్తుతం ఉన్న జనాభాకు తాగునీటికి మాత్రమే సరిపోతుందన్నారు. అయితే ఈ జిల్లాలో అవసరమైన సాగునీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. అందుబాటులోకి వ చ్చే 24 టీఎంసీల నీటిని ఏ జలాశయం నుంచి తీసుకువస్తారో ఇప్పుడే చెప్పాలని పట్టుబట్టారు. అదేవిధంగా ఎత్తిన హోళే పథకంపై అనేక సాంకేతిక పరమైన సమస్యలు ఉండటంతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, నిపుణులు అడిగిన ప్రశ్నలకు సిద్ధరామయ్యతో పాటు అక్కడే ఉన్న సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్, ఇతర ప్రభుత్వ అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తూ రైతు సంఘం నాయకులు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పార్లమెంటు సభ్యుడు వీరప్పమొయిలీను కూడా విమర్శించడం మొదలు పెట్టారు. దీంతోమొయిలీ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఇదిలా ఉండగా మైదానప్రాంత జిల్లాల్లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం డాక్టర్ పరమశివయ్య నివేదికను తప్పక అమలు చేయాలని సమావేశంలో రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ తమ పోరాటం ఆగదని రైతు సంఘం నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌తోపాటు సమావేశంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
బీజేపీలో నైరాశ్యం
బెంగళూరు(బనశంకరి) : బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీని వంద స్థానాల్లో గెలుపించిన సామ్రాట్‌గా పేరుపొందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ నడవడికే వారిని ముంచింది. బేషరత్తుగా మద్దతు ఇస్తామంటూ అశోక్ వద్దకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అశోక్ నిర్లక్ష్యం చేయడమే ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది. అశోక్ దురహంకార ధోరణితోనే చేతులారా బీబీఎంపీని వదులుకోవాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది. రాజకీయబద్ద శత్రువులుగా ముద్రపడ్డ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హెచ్డీ దేవెగౌడ బీబీఎంపీని దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారు. ఈ స్నేహం రానున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని వినబడుతుంది. బీబీఎంపీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొందిన అధికారం చేపట్టడంలో విఫలమైన పార్టీ నేతలపై పాలికె సభ్యులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, బీబీఎంపీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవశం చేసుకోవడంతో కాంగ్రెస్, జేడీయస్ పార్టీ శ్రేణుల్లో ఆనందాలు మిన్నంటాయి. బీబీఎంపీలో మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే ప్రవేశద్వారం ద్వారా వందలాదిమంది కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు గుంపులుగా చేరిన కార్యకర్తలను చెదరగొట్టారు. అయినప్పటికీ వందలాది సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అంతేగాక కేపీసీసీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అలాగే జేడీఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా సంబరాలు మిన్నం టాయి. 8 ఏళ్ల అనంతరం జేడీఎస్- కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటం రాష్ట్రరాజకీయాల్లో సంచలనానికి తెరలేపింది. -
కోలారులో మరో పారిశ్రామికవాడ
వేలాది మందికి ఉద్యోగావకాశాలు నేడు పరిశ్రమలకు భూమిపూజ హాజరుకానున్న సీఎం సిద్ధరామయ్య కోలారు: జిల్లాలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. ఇప్పటికే కోలారు తాలూకాలోని నసరాపురం వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. ప్రస్తుతం కోలారు తాలూకాలోనే వేమగల్ ప్రాంతం అతి పెద్ద పారిశ్రామిక వాడ కానుంది. నియోజక వర్గ పునర్విభజన కాకముందు వేమగల్ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2014 తరువాత వేమగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోలారులో కలిపారు. ప్రస్తుతం వేమగల్ ప్రాంతం ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్ క్లెయిన్ కంపెనీకి శంకుస్థాపన చేయడంతోపాటు మరో రెండు కంపెనీలు అధికారికంగా ప్రారంభించనున్నారు. వేమగల్ పారిశ్రామిక ప్రాంతం 664.41 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కురుగల్, హార్జేనహళ్లి, పర్జేనహళ్లి, సింగహళ్లి గ్రామాల పరిధిలో పారిశ్రామిక ప్రాంతం వ్యాపించి ఉంది. ప్రభుత్వం కేఐఏడీబీ ద్వారా ఈ ప్రాంతంలోని రైతుల నుంచి పరిశ్రమల కోసం భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు. కేఐఏడీబీ వేమగల్ పారిశ్రామిక వాడకు 2014 మే 22న పరిపాలన మరియు ఆర్థిక శాఖ ఆమోదం పొంది. 155.08 కోట్ల వ్యయంతో పారిశ్రామిక వాడను అభివృధ్ది చేయడానికి 27.23 ఎకరాల విస్తీర్ణంలో రహదారులను అభివ్రుధ్ది చేస్తున్నారు. కే పీటీసీఎల్కు 10 ఎకరాల స్థలాన్ని రిజర్వు చేసి ఉంచారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాలుగు కంపెనీల స్థాపనకు అవకాశం కల్పించారు. అందులో మిత్సుబిషి ఎలెక్ట్రిక్, టాటా పవర్ కంపెనీ, జిఎస్ఏ కంపెనీలకు తలా 50 ఎకరాల స్థలాన్ని, శివం ఆటో మొబైల్ కంపెనీకి 20 ఎకరాల స్థలాన్ని పంపిణీ చేయడం జరిగింది. వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో మౌళిక సౌలభ్యాలను అందించడానికి 100.02 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు ప్రగతిలో ఉంది. విశాలమైన రహదారులు, డ్రై నేజి, కాలువలు తదితర సౌలభ్యాలను అందిస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతానికి బెంగుళూరు కాడుబీసన హళ్లి నుంచి మురికినీటిని శుధ్దీకరించి సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ పనులకు ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. మిత్సుబిషి ఎలెక్ట్రిక్ కంపెనీ లిఫ్ట్ తయారీ యూనిట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఔషధాలను తయారు చేసే గ్లాక్సో స్మిత్ లైన్ కంపెనీ శంకుస్థాపనను గురువారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 250 కోట్ల వ్యయంతో ఈ కంపెనీని ప్రారంభిస్తుండి సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభమవుతున్న కంపెనీలలో స్థానికులకు భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు విద్యార్హతను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని కంపెనీలకు సూచించడం జరిగింది. కరువు ప్రాంతమైన జిల్లాలో వేమగల్ పారిశ్రామిక ప్రాంతం వల్ల ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. - కలెక్టర్ డాక్టర్ త్రిలోక్‌చంద్ర