కాంగ్రెస్ నేతల్లో తీవ్ర చర్చ
పార్టీ కోసం శ్రమించిన వారిని పట్టించుకోవడం లేదు : అసంతృప్తుల ఆవేదన
దిగ్విజయ్ సింగ్‌తో భేటీకి సన్నద్ధం
బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పా లేక మంత్రివర్గ ప్రక్షాళన అన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆ పీఠం నుంచి తప్పించాలంటూ సీనియర్ నేతలు హైకమాండ్‌కు విన్నవిస్తుండగా, మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లో మునిగిపోయారు. దీంతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖకు చెందిన ముఖ్య నేతలు ఆయనతో బుధవారం భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు, మంత్రి వర్గ పునర్నిర్మాణం తదితర అంశాలపై దిగ్విజయ్ సింగ్ వీరితో చర్చించనున్నారు.
మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో పాటు ఆస్కార్ ఫెర్నాండెజ్, జాఫర్ షరీఫ్ తదితరులు ఇప్పటికే ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్‌ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, పార్టీ కోసం శ్రమించిన వారిని, జేడీఎస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన సీఎం సిద్ధరామయ్య పట్టించుకోవడం లేదన్నది వీరి వాదన. తమ అభిప్రాయాలు, సలహాలను సిద్ధరామయ్య పరిగణలోకి తీసుకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వీరంతా గుర్రుగా ఉన్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం తన పదవికే ముప్పు వ చ్చే సమయంలో అసంతృప్త నేతలందరినీ కలుపుకొని పోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు వేసవిలో ఎండవేడిమి కంటే ఎక్కువగా సెగ రగిలిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.