ముఖ్యమంత్రి మార్పు ప్రసక్తే లేదు
మంత్రి రామలింగారెడ్డి
కోలారు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పూర్తి కాలం అదే పదవిలో కొనసాగుతారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... సిఎం సిద్దరామయ్య ఉత్తమ పరిపాలన అందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ నాయకులు అకారణంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష తనకు కూడా ఉందని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఆంజనేయులు, జనార్దన పూజారి మధ్యన జరిగిన మాటల యుద్ధంపై స్పందించిన మంత్రి నాలుగు గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం వీధికెక్కడం మంచిది కాదన్నారు.
కేపీసీసీ పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం ఇష్టమన్నారు. ఎంపీ కేహెచ్ మునియప్ప అనుభవం దృష్ట్యా ఆయన ఆ పదవికి అర్హుడన్నారు. అదే విధంగా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే రూ. 4 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. బెంగుళూరులోని చెత్తను కేజీఎఫ్‌లో వేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.