కోలారులో మరో పారిశ్రామికవాడ
వేలాది మందికి ఉద్యోగావకాశాలు
నేడు పరిశ్రమలకు భూమిపూజ
హాజరుకానున్న సీఎం సిద్ధరామయ్య
కోలారు: జిల్లాలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. ఇప్పటికే కోలారు తాలూకాలోని నసరాపురం వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. ప్రస్తుతం కోలారు తాలూకాలోనే వేమగల్ ప్రాంతం అతి పెద్ద పారిశ్రామిక వాడ కానుంది. నియోజక వర్గ పునర్విభజన కాకముందు వేమగల్ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2014 తరువాత వేమగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోలారులో కలిపారు. ప్రస్తుతం వేమగల్ ప్రాంతం ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్ క్లెయిన్ కంపెనీకి శంకుస్థాపన చేయడంతోపాటు మరో రెండు కంపెనీలు అధికారికంగా ప్రారంభించనున్నారు. వేమగల్ పారిశ్రామిక ప్రాంతం 664.41 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కురుగల్, హార్జేనహళ్లి, పర్జేనహళ్లి, సింగహళ్లి గ్రామాల పరిధిలో పారిశ్రామిక ప్రాంతం వ్యాపించి ఉంది. ప్రభుత్వం కేఐఏడీబీ ద్వారా ఈ ప్రాంతంలోని రైతుల నుంచి పరిశ్రమల కోసం భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు. కేఐఏడీబీ వేమగల్ పారిశ్రామిక వాడకు 2014 మే 22న పరిపాలన మరియు ఆర్థిక శాఖ ఆమోదం పొంది. 155.08 కోట్ల వ్యయంతో పారిశ్రామిక వాడను అభివృధ్ది చేయడానికి 27.23 ఎకరాల విస్తీర్ణంలో రహదారులను అభివ్రుధ్ది చేస్తున్నారు.
కే పీటీసీఎల్‌కు 10 ఎకరాల స్థలాన్ని రిజర్వు చేసి ఉంచారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాలుగు కంపెనీల స్థాపనకు అవకాశం కల్పించారు. అందులో మిత్సుబిషి ఎలెక్ట్రిక్, టాటా పవర్ కంపెనీ, జిఎస్‌ఏ కంపెనీలకు తలా 50 ఎకరాల స్థలాన్ని, శివం ఆటో మొబైల్ కంపెనీకి 20 ఎకరాల స్థలాన్ని పంపిణీ చేయడం జరిగింది. వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో మౌళిక సౌలభ్యాలను అందించడానికి 100.02 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు ప్రగతిలో ఉంది. విశాలమైన రహదారులు, డ్రై నేజి, కాలువలు తదితర సౌలభ్యాలను అందిస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతానికి బెంగుళూరు కాడుబీసన హళ్లి నుంచి మురికినీటిని శుధ్దీకరించి సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ పనులకు ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. మిత్సుబిషి ఎలెక్ట్రిక్ కంపెనీ లిఫ్ట్ తయారీ యూనిట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఔషధాలను తయారు చేసే గ్లాక్సో స్మిత్ లైన్ కంపెనీ శంకుస్థాపనను గురువారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 250 కోట్ల వ్యయంతో ఈ కంపెనీని ప్రారంభిస్తుండి సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
స్థానికులకు ఉద్యోగావకాశాలు
వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభమవుతున్న కంపెనీలలో స్థానికులకు భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు విద్యార్హతను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని కంపెనీలకు సూచించడం జరిగింది. కరువు ప్రాంతమైన జిల్లాలో వేమగల్ పారిశ్రామిక ప్రాంతం వల్ల ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
- కలెక్టర్ డాక్టర్ త్రిలోక్‌చంద్ర