ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: పీయూసీ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరించారు. లీకేజీకి పాల్పడిన వారు ఎంత ప్రాబల్యం కలిగిన వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంగళవారమిక్కడి విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబూ జగ్‌జీవన్ రామ్ విగ్రహానికి మాలార్పణ చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శర ణ ప్రకాష్ పాటిల్ పీఏ లీకేజీ వ్యవహారంలో భాగస్వామిగా మారిన వైనం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అతడిని ఇప్పటికే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఇక చట్టం ఎదుట ఎవరూ పెద్దవారు కాదని, లీకేజీ వ్యవహారంలో భాగస్వాములైన వారందరినీ శిక్షించి తీరతామని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రి వర్గ పునఃనిర్మాణానికి సంబంధించి హైకమాండ్‌తో చర్చించేందుకు గాను త్వరలోనే ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు.