వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పొందేందుకు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పనిసరి అన్న 2017 ఆగస్టు 10 నాటి ఆర్డర్ ద్వారా విధించిన షరతును సుప్రీంకోర్టు తొలగించింది.
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 2017 ఆర్డర్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రమాద బాధితులు నేరుగా వాహన యజమానుల నుంచి నష్టపరిహారం కోరుతున్నారని, కానీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడంతో వాహన యజమానులు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వాహన బీమా పాలసీ పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అని మోటారు వాహనాల చట్టం, 1988 కానీ దాని కింద రూపొందించిన మరే ఇతర చట్టం కానీ నిబంధనలు విధించలేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాలు ఎప్పటికప్పుడు పీయూసీ సర్టిఫికెట్లను కలిగి ఉండేలా ఈ షరతు విధించామని, దీనికి మరింత సమర్థవంతమైన పరిష్కారం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. కాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాహనాలను ట్రాక్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోర్టు సూచించింది.
థర్డ్-పార్టీ వాహన బీమా కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ 2017లో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలనే ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు గతంలోనే వ్యక్తం చేసింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ విస్మరిస్తున్న వాహనదారులు 55% మంది ఉన్నారని, దీంతో ప్రమాద క్లెయిమ్‌లు పరిహారం పొందడం కష్టంగా మారిందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని కొనసాగిస్తూనే వాహనం పీయూసీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా బ్యాలెన్స్‌డ్ విధానం అవసరమని కోర్టు అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment