పొల్యూషన్ సర్టిఫికెట్
సాక్షి, న్యూఢిల్లీ: మీ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేనట్లయితే పెట్రోలు పంపు నిర్వాహకులు మీ వాహనంలో ఇంధనం నింపడానికి నిరాకరించే రోజులు త్వరలో రానున్నాయి. బంకు పెట్రోలు పోయించుకోవాలంటే వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ తప్పక ఉండాలనే ప్రతిపాదనకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆమోదం తెలిపారు. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్న సంగతి తెల్సిందే. దీంతో ఢిల్లీలో కాలుష్య స్థాయిని నియంత్రించేందుకు సిఫారసులు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పీయూసీ సర్టిఫికెట్ కలిగిన వాహనంలోనే పెట్రోలు నింపాలన్న నియమం విధించాలని సిఫారసు చేసింది.
ఈ నియమాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్నదానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ నవంబర్ నెలలో దీనిని అమలు చేయవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేలోగా నగరంలో తగినన్ని పెట్రోలు పంపులలో పీయూసీ సరిఫికెట్ జారీ చేసే సదుపాయం ఉండేలా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని 80 శాతం పెట్రోలు పంపులలో వాహనాల కాలుష్య స్థాయిని పరీక్షించి పీయూసీ సర్టిఫికెట్ జారీచేసే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగతా 20 శాతం పెట్రోలు పంపులలో కూడా ఈ సదుపాయం లభించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
అయితే రద్దీగా సమయాల్లో బంకుల వద్ద పీయూసీ సర్టిఫికెట్లు చూసిన తరువాతే వాహనాలలో పెట్రోలు నింపడం సమస్య కావచ్చని, ఇది కస్టమర్లకు, సిబ్బందికి మధ్య వాదనలకు, ఘర్షణలకు దారితీయవచ్చని యజమానులు అంటున్నారు. పెట్రోలు అత్యవసర సరుకులలో ఒకటని, పీయూసీ లేదన్న కారణంతో పెట్రోలు నింపడానికి నిరాకరించ లేమని ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన అనురాగ్ నారాయణ్ అంటున్నారు. దీనికన్నా నగరంలో చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు జరిపి పీయూసీ లేనివాహనం నడిపేవారికి చలాన్లు విధించినట్లయితే మేలని ఆయన సూచించారు.