శబ్ధరహిత దీపావళి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజధాని నగరంలో శబ్ధ రహితంగా దీపావళి పండుగను జరుపుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర హర్షవర్ధన్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. నివాసిత ప్రాంతాల్లో భారీ శబ్ధం చేసే బాణసంచాను కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్ ఈ మేరకు గురువారం నజీబ్ జంగ్‌కు ఒక లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఢిల్లీలో మాత్రం అది కనిపించడం లేదని పేర్కొన్నారు. బాణసంచా భారీ పేలుళ్ల శబ్ధం కారణంగా పిల్లలు, వయోవృద్ధులు ఆరోగ్య సంబంధమైన సమస్యలకు గురవుతారని స్వయంగా వైద్యుడైన వర్ధన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పరిపాలన యంత్రాంగం గతంలో సాకులు చెప్పిందని ఆయన ఆరోపించారు. పోలీసు సిబ్బంది సరిపోను లేరని, బాణసంచా పేల్చడం మన సంస్కృతి వంటి కారణాలు వినిపించారని పేర్కొన్నారు. ఈ కారణాలు ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ దీపావళి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీలో మార్పు కనిపించాలని వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నివాస ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2005 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగకు మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగా వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వర్ధన్ కోరారు. బాణసంచా నుంచి వెలువడే శబ్ధ కాలుష్యం వల్ల అన్ని వయస్సుల వారికి భౌతికంగా అసౌకర్యం కలగడంతో పాటు మానసిక రుగ్మతలకు కూడా దారి తీయవచ్చని వర్ధన్ హెచ్చరిం చారు. శబ్ధ కాలుష్యం వల్ల జరిగే అనర్ధాలపై పిల్లలకు అవగాహన కల్పించేం దుకు స్కూళ్లు, కాలేజీలను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.