Lt-Governor Najeeb Jung
-
శబ్ధరహిత దీపావళి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజధాని నగరంలో శబ్ధ రహితంగా దీపావళి పండుగను జరుపుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర హర్షవర్ధన్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. నివాసిత ప్రాంతాల్లో భారీ శబ్ధం చేసే బాణసంచాను కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్ ఈ మేరకు గురువారం నజీబ్ జంగ్కు ఒక లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఢిల్లీలో మాత్రం అది కనిపించడం లేదని పేర్కొన్నారు. బాణసంచా భారీ పేలుళ్ల శబ్ధం కారణంగా పిల్లలు, వయోవృద్ధులు ఆరోగ్య సంబంధమైన సమస్యలకు గురవుతారని స్వయంగా వైద్యుడైన వర్ధన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పరిపాలన యంత్రాంగం గతంలో సాకులు చెప్పిందని ఆయన ఆరోపించారు. పోలీసు సిబ్బంది సరిపోను లేరని, బాణసంచా పేల్చడం మన సంస్కృతి వంటి కారణాలు వినిపించారని పేర్కొన్నారు. ఈ కారణాలు ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ దీపావళి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీలో మార్పు కనిపించాలని వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2005 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగకు మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగా వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వర్ధన్ కోరారు. బాణసంచా నుంచి వెలువడే శబ్ధ కాలుష్యం వల్ల అన్ని వయస్సుల వారికి భౌతికంగా అసౌకర్యం కలగడంతో పాటు మానసిక రుగ్మతలకు కూడా దారి తీయవచ్చని వర్ధన్ హెచ్చరిం చారు. శబ్ధ కాలుష్యం వల్ల జరిగే అనర్ధాలపై పిల్లలకు అవగాహన కల్పించేం దుకు స్కూళ్లు, కాలేజీలను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. -
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోలు
సాక్షి, న్యూఢిల్లీ: మీ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేనట్లయితే పెట్రోలు పంపు నిర్వాహకులు మీ వాహనంలో ఇంధనం నింపడానికి నిరాకరించే రోజులు త్వరలో రానున్నాయి. బంకు పెట్రోలు పోయించుకోవాలంటే వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ తప్పక ఉండాలనే ప్రతిపాదనకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆమోదం తెలిపారు. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్న సంగతి తెల్సిందే. దీంతో ఢిల్లీలో కాలుష్య స్థాయిని నియంత్రించేందుకు సిఫారసులు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పీయూసీ సర్టిఫికెట్ కలిగిన వాహనంలోనే పెట్రోలు నింపాలన్న నియమం విధించాలని సిఫారసు చేసింది. ఈ నియమాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్నదానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ నవంబర్ నెలలో దీనిని అమలు చేయవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేలోగా నగరంలో తగినన్ని పెట్రోలు పంపులలో పీయూసీ సరిఫికెట్ జారీ చేసే సదుపాయం ఉండేలా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని 80 శాతం పెట్రోలు పంపులలో వాహనాల కాలుష్య స్థాయిని పరీక్షించి పీయూసీ సర్టిఫికెట్ జారీచేసే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగతా 20 శాతం పెట్రోలు పంపులలో కూడా ఈ సదుపాయం లభించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే రద్దీగా సమయాల్లో బంకుల వద్ద పీయూసీ సర్టిఫికెట్లు చూసిన తరువాతే వాహనాలలో పెట్రోలు నింపడం సమస్య కావచ్చని, ఇది కస్టమర్లకు, సిబ్బందికి మధ్య వాదనలకు, ఘర్షణలకు దారితీయవచ్చని యజమానులు అంటున్నారు. పెట్రోలు అత్యవసర సరుకులలో ఒకటని, పీయూసీ లేదన్న కారణంతో పెట్రోలు నింపడానికి నిరాకరించ లేమని ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన అనురాగ్ నారాయణ్ అంటున్నారు. దీనికన్నా నగరంలో చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు జరిపి పీయూసీ లేనివాహనం నడిపేవారికి చలాన్లు విధించినట్లయితే మేలని ఆయన సూచించారు. -
షీలాను తొలగించాల్సిందే
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనధికార కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించడంతో వెంటనే ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని లెఫ్టినెంట్ గరవ్నర్ నజీబ్ జంగ్‌ను కోరినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఆమెపై పోలీస్ కేసు నమో దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు 2012-13లో కూడా షీలాదీక్షిత్ ప్రభుత్వం పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఉపాధ్యాయ్ ఆరోపించారు. అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనూ ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటే 15 ఏళ్లలో షీలా ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో సామాన్య ఢిల్లీవాసికి సైతం అర్థమవుతుందని ఎద్దేవాచేశారు. అనధికార కాలనీల్లో షీలా సర్కార్ చేపట్టిన పనులు, వాటిలో జరిగిన అవకతవకలు తదితర విషయాలపై కాగ్ బయటపెట్టిన విషయాలను అధ్యయనం చేసేం దుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆదివారం సమావేశం నిర్వహించిందని ఉపాధ్యాయ్ వివరించారు. ‘అనధికార కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు 2008 ఎన్నికల సమయం లో షీలా సర్కార్ ప్రజలకు ప్రకటించింది. ఆ మేరకు పలు కాలనీల్లో ధ్రువీకరణ పత్రాలను సైతం పంపి ణీ చేసింది. అప్పటినుంచి స్థానికులను భ్రమల్లోనే ఉంచి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండానే నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఒక్క 2012-13లోనే అనధికార కాలనీల్లో సుమారు రూ. కోట్లాది విలువైన పనులు చేసినట్లు చూపించారు. అయితే అక్కడ సుమారు రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గత పరిచింద’ని ఉపాధ్యాయ్ వివరించారు. అలాగే ఆయా అనధికార కాలనీల్లో రోడ్ల మరమ్మతుల నిమిత్తం డీఎస్‌ఐఐడీసీ రూ. 206 కోట్లు ఖర్చుచేసింది. అయితే నీటిపైపుల ఏర్పాటు నిమిత్తం ఆ రోడ్లను తవ్వేశారు. నిజానికి నగరంలో 685 అనధికార కాలనీలు ఉండగా, కేవలం 158 కాలనీల్లోనే నీటిపైపుల పనులు జరిగినట్లు కాగ్ నివేదించింది. అలాగే డ్రైనేజీ పనుల నిమిత్తం సుమారు రూ.49 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ ప్రభుత్వం లెక్కలు చూపించినా కాగ్‌కు మాత్రం ఏ ఒక్క కాల నీలోనూ డ్రైనేజీలు కనిపించకపోవడం కాంగ్రెస్ అవినీతికి అద్దం పడుతోంద..’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలు వెంటనే జరిపించాలని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆమ్ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఉపాధ్యాయ్ స్పం దిం చారు. ఆప్‌ది మొసలి కన్నీరని ఆయన విమర్శిం చారు. తమ రాజకీయ మనుగడ కోసమే ఆప్ నాయకులు ర్యాలీ డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవేళ వారికి ఢిల్లీవాసులపై అభిమానముంటే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటుచేయడంలేదని ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఇంతా చేస్తే ఆ పార్టీ ర్యాలీకి కేవలం 3,500 మంది హాజరయ్యారంటే వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు ఏమాత్రమో అర్థమవుతోందని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రమేష్ బిధూరీ ఎద్దేవా చేశారు.