Union Health Minister Harsh Vardhan
-
మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల డోసుల టీకాలు మాత్రమే ఉన్నాయని, అవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేక చాలా చోట్ల టీకా కేంద్రాలను మూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘గతంలో రోజుకి 4 లక్షల మందికి టీకా ఇచ్చేవాళ్లం. రోజుకి ఆరు లక్షల డోసులు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం రోజుకి 5 లక్షల మందికి టీకా ఇస్తున్నాం. కానీ టీకాల నిల్వ రోజుకీ తగ్గుతోంది’ అని వివరించారు. మహారాష్ట్రలో కరోనా విస్తృతి దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా 50 వేలు దాటిందని తెలిపారు. అందువల్ల, మహారాష్ట్రకు అధిక మొత్తంలో టీకాలను పంపించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కరోనా సోకుతున్న వారిలో 20–40 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నందున, వారికి కూడా టీకా అందించేలా ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. టీకాల కొరత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వెల్లడించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 1.06 కోట్ల డోసుల వ్యాక్సిన్ రాగా, 88 లక్షల డోసులను పౌరులకు ఇచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీకాల కొరత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. సరిపోను టీకాలు లేవంటూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కొరత వాదన అర్థం లేనిదన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, క్వారంటైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు -
కరోనా టీకా: మొదట వారికే ఇస్తాం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు. ప్రస్తుతం 20 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్ఫర్డ్–సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత) క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్! ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్‌లో వ్యాక్సిన్‌కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్మస్కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు. వృద్ధుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సత్ఫలితాలు లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్‌లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్ఫర్డ్ వాక్సిన్ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు. -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. మార్చిలో లాక్డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్ దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలంలో సెకండ్ వేవ్ ? దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు. పత్రికల ద్వారా సోకదు వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు. -
పండుగలు ఇంట్లోనే చేసుకోండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గిపోయే అవకాశం లేదు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ‘సండే సంవాద్’లో భాగంగా ఆయన ఆదివారం సోషల్ మీడియాలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రాబోయే పండుగ సీజన్లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరం గా ఉండాలని సూచించారు. పండుగ వేడుకలతో తమను మెప్పించాలంటూ ఏ మతమూ, ఏ దేవుడూ ప్రజలను కోరరని అన్నారు. ఊరేగింపుల్లో పాల్గొని ముప్పు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. మన లక్ష్యం.. కరోనా అంతం త్వరలో ప్రారంభం కానున్న చలికాలంలో కరోనా వ్యాప్తి మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఏ సమాచారమైన పూర్తిగా నిర్ధారించుకోకముందే ఇతరులతో పంచుకోరాదని సూచించారు. కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. అందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొదటి దశలో రూ.3,000 కోట్లు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం దేశంలో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ఒకటి, రెండు, మూడో దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. కరోనా నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్టు మరికొన్ని వారాల్లో నే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. -
జూలైకి 25 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జూలై కల్లా దేశంలోని 20 నుంచి 25 కోట్ల మందికి సరిపోయేలా 40 నుంచి 50 కోట్ల కోవిడ్–19 టీకా డోసుల్ని సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ టీకాను ఇవ్వాల్సిన వారి పేర్లను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్ చివరిలోగా అందజేయాలని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. కోవిడ్–19పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ‘సండే సంవాద్’వేదికగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. కోవిడ్–19 పంపిణీపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తోందన్నారు. టీకా పంపిణీలో అనుసరించాల్సిన ప్రాధాన్యతా క్రమంపై రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ కమిటీ ఒక ఫార్మాట్‌ను తయారు చేస్తోందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంలో కోవిడ్–19 ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సిబ్బందికి ఇస్తామన్నారు. ‘టీకా సేకరణ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. అది సిద్ధమయ్యాక అందరికీ సమానంగా, నిష్పక్షపాతంగా అందించేందుకు చేపట్టే ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోంది’అని చెప్పారు. ‘దేశంలోని వివిధ సంస్థలు టీకా అభివృద్ధి కోసం సాగిస్తున్న ప్రయత్నాలు.. అవి ఏ దశలో ఉన్నాయనే అంశాన్ని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు ఆయా సంస్థల నుంచి సేకరించే టీకాపై ముందుగానే హామీ తీసుకుంటోంది’అని అన్నారు. తయారైన టీకాను పక్కదారి పట్టించడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి తావు లేదన్నారు. రష్యా టీకా స్పుత్నిక్–వీకి భారత్‌లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చే అంశం పరిశీలనలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు 65 లక్షలు పైనే న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75,829 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,49,373కు చేరుకుంది. అదే సమయంలో 940 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,782 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 55,09,966కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,37,625గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 14.32 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 84.13 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.55 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 278 మంది మరణించారు. ఈ నెల 3 వరకూ 7,89,92,534 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 11,42,131 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. -
వచ్చే ఏడాది మొదట్లో టీకా
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. టీకా భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా తానే మొదటి డోసు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా సండే సంవాద్ కార్యక్రమంలో మంత్రి తన ఫాలోవర్లతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు సందేహాలకు ఆయన జవాబులిచ్చారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ తదనంతర ప్రపంచం ఎలా ఉంటుందన్న దానిపై మాట్లాడారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు బ్రిటన్‌లో మళ్లీ మొదలైన నేపథ్యంలోనే హర్షవర్ధన్ కరోనా వ్యాక్సిన్‌పై వివరంగా మాట్లాడారు. డీసీజీఐ అనుమతులు ఇచ్చాక సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో కూడా ప్రయోగాలు ప్రారంభించనుంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకే మొదటి ప్రాధాన్యం కరోనా వ్యాక్సిన్ ఎవరికైతే∙అత్యవసరమో వారికే ముందు లభిస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. ఆర్థికంగా వారికి టీకా కొనుగోలు చేసే శక్తి ఉన్నా లేకపోయినా సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘‘2021 మొదటి నాలుగు నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రజల్లో టీకా భద్రతపై భయాలుంటే నేను మొదట వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రంట్ లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లకి మొదట వ్యాక్సిన్ లభించేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది’’అని హర్షవర్ధన్ వెల్లడించారు. టీకా భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా వంటి అన్ని అంశాల్లోనూ ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. 47 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా జోరు తగ్గడం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94,372 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,54,356 కు చేరుకుంది. ఇటీవల మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,114 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 78,586కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,02,595కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,73,175గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.47 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.88 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
కోవిడ్ కేసులు @ 30 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో 69,239 కోవిడ్–19 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30,44,940కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 912 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56,706కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,80,566కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,668గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.24గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.90 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.86 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. తాజా 912 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 297 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 7.67 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల రోజుకు దాదాపుగా 8 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,515 ల్యాబులు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. భారత్ లో కరోనా కేసులు 10 లక్షల నుంచి 20 లక్షలు చేరుకోవడానికి 21 రోజులు పట్టగా, 20 లక్షలు దాటిన 16 రోజుల్లోనే 30 లక్షల మార్కును చేరడం గమనార్హం. ఏడాది చివరికి వ్యాక్సిన్: హర్షవర్థన్ అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు భారత్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తుండగా, ఇంకోటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా టీకా ప్రయోగాలు మొదటి దశ మానవ ప్రయోగాలను ముగించుకొని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా రెండు, మూడు దశల మానవ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. -
78 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 2,549 మంది మరణించారు. మొత్తం 78,003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 3,722 కేసులు బయటపడ్డాయి. 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 49,219 కాగా, 26,234 మంది చికిత్స అనంతరం కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 33.63 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్రను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 975 మంది కరోనా వల్ల కన్నుమూశారు. అలాగే 25,922 పాజిటివ్ కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 13.9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కరోనా కేసులు రెట్టింపయ్యే వ్యవధి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. గత మూడు రోజుల్లో ఈ వ్యవధి 13.9 రోజులకు చేరిందని చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను(ఎన్సీడీసీ) సందర్శించారు. కోబాస్–6800 టెస్టింగ్ మెషీన్లను జాతికి అంకితం చేశారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో గత 14 రోజులుగా 11.1 రోజులుగా ఉన్న కరోనా కేసుల డబ్లింగ్ టైమ్ గత 3 రోజులుగా 13.9 రోజులకు చేరడం శుభపరిణామమని అన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచామన్నారు. ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అత్యాధునిక కోబాస్–6800 యంత్రంతో 24 గంటల్లోనే 1,200 కరోనా నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు. -
9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మేఘాలయ, గోవా, లద్దాఖ్, మిజోరం, అండమాన్, నికోబార్ సహా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. సిక్కిం, నాగాలాండ్, డయ్యూ డామన్, లక్షద్వీప్‌ల్లో ఇప్పటివరకు కేసులేమీ నమోదు కాలేదన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 74,281 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు ఈ మహమ్మారితో 2,415 మంది చనిపోయారని వెల్లడించారు. గత 24 గంటల్లో 122 మరణాలు చోటు చేసుకోగా, 3,525 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు 24,385 మంది కోలుకున్నారని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 47,480 అని వివరించారు. ప్రస్తుతం మరణాల రేటు 3.2 శాతంగా, కోలుకుంటున్నవారి శాతం 32.83గా ఉందన్నారు. గత రెండు వారాలుగా కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం 11 రోజులుగా ఉందని, అయితే, గత మూడురోజుల్లో అది 12.6 రోజులకు మెరుగయిందని వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో కరోనా పరిస్థితిని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఎస్కే సింగ్ వివరించారు. మే 12 నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాలు కరోనా బారిన పడ్డాయని, మొత్తం 1,913 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు సుమారు 1.8 లక్షల బెడ్స్ కెపాసిటీతో 19 కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు, 1.3 లక్షల బెడ్స్ సామర్ధ్యంతో 2040 కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లు, 4.93 లక్షల బెడ్స్ సామర్థ్యంతో 5,577 కోవిడ్ కేర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 8,708 క్వారంటైన్ కేంద్రాలున్నాయన్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు చోటు చేసుకున్న మొత్తం 122 మరణాల్లో మహారాష్ట్రలో 53, గుజరాత్లో 24, ఢిల్లీలో 13 ఉన్నాయన్నారు. రైల్ భవన్ మూసివేత భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ భవన్ గురువారం నుంచి రెండు రోజుల పాటు మూతపడనుంది. ఆర్పీఎఫ్ ఉద్యోగి ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిందని, ఆ వ్యక్తి మే 6 నుంచి హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. -
రికార్డు స్థాయిలో మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోన రక్కసి జనం ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కరోనా సంబంధిత మరణాలు వెయ్యి మార్కును దాటేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,008కు, మొత్తం పాజిటివ్ కేసులు 31,787కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 22,982 కాగా, 7,796 మంది బాధితుల కోలుకున్నారు. అంటే మొత్తం బాధితుల్లో 24.52 శాతం మంది ఆరోగ్యవంతులైనట్లు స్పష్టమవుతోంది. కేవలం 0.33% మంది వెంటిలేటర్లపై దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో కేవలం 0.33 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. 1.5 శాతం మంది ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారని, 2.34 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. హర్షవర్దన్ బుధవారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో సరిపడా ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో ప్రస్తుతం 288 ప్రభుత్వ ల్యాబ్‌లు 97 ప్రైవేట్ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 16,000 కరోనా నమూనా సేకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. నిత్యం 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్ కెపాసిటీని పెంచుతామన్నారు. అందుబాటులో ఉన్న సోషల్ వ్యాక్సిన్లు లాక్డౌన్, భౌతిక దూరం అని స్పష్టం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని హర్షవర్దన్ కొనియాడారు. 129కి తగ్గిన హాట్‌స్పాట్ జిల్లాలు దేశంలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు గత 15రోజుల్లో 170 నుంచి 129కి తగ్గాయి. అలాగే కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రీన్జోన్లు 307 నుంచి 325కు పెరిగాయి. నాన్–హాట్‌స్పాట్ జిల్లాలు(ఆరెంజ్ జోన్లు) 207 నుంచి 297కు చేరాయి. ఏప్రిల్ 15వ తేదీన కేంద్ర ప్రభు త్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి లాక్డౌన్ కంటే ముందు 3 నుంచి 3.25 రోజులు పట్టగా, ప్రస్తుతం 10.2 నుంచి 10.9 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. -
ఒక్కరోజులో 1,975 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అలజడి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేవలం ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 20,177 కాగా, 5,914 మంది(21.96 శాతం) బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మొత్తం కరోనా బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఏప్రిల్ 24న 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును తిరగరాస్తూ తాజాగా 1,975 కేసులు బయట పడడం గమనార్హం. పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్ దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆరోగ్య శాఖా మంత్రి హర్‡్షవర్ధన్ తెలిపారు. చాలా జిల్లాలు హాట్‌స్పాట్ (ప్రమాదకర/అత్యధిక కేసులు నమోదవుతున్న) నుంచి నాన్ హాట్స్పాట్లుగా మారుతున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ నివారణ విషయంలో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాగా, గుజరాత్లో కరోనా వల్ల ఇప్పటిదాకా 133 మంది మృతిచెందారు. ఎల్–టైప్ వైరస్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలోని వూహాన్లో ఈ వైరస్‌నే అలజడి సృష్టించింది. ఎస్–టైప్ కంటే ఎల్–టై‹ప్ వైరస్ మరింత ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ’ కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివృద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. -
కరోనాపై జీఓఎం భేటీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది. భౌతిక దూరం పాటించడం సహా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది. రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రుల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఇతర వైద్య ఉపకరణాలను సమకూర్చడం, సిబ్బందికి పీపీఈలను అందించడంపై వారు చర్చించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్, వైరస్ హాట్‌స్పాట్స్ నిర్వహణలను కూడా వారు సమీక్షించారు. కరోనా పరీక్షలను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్స్ వివరాలను కూడా వారికి అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది. కోవిడ్–19కి సంబంధించి ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, పీఐబీ సహా ఇతర ప్రభుత్వ వెబ్సైట్లు అందించే సమాచారాన్నే విశ్వసించాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి మాస్క్‌ను వాడాలనే విషయాన్ని ఆరోగ్య శాఖ వెబ్సైట్లో విపులంగా వివరించామన్నారు. -
రెండు కేసులు గుర్తించాం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణల్లో రెండు కోవిడ్ కేసులు తాజాగా వెలుగుచూశాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ బాధితుడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారని, అలాగే తెలంగాణకు చెందిన ఒకరు దుబాయ్ నుంచి వచ్చారని పేర్కొంది. ‘ప్రస్తుతం ఒకరు ఢిల్లీ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో, మరొకరు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉన్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉన్న 3,217 మంది శాంపుల్స్ పరీక్షించగా ఐదుగురిలో కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, మరో 32 శాంపుల్స్ ఫలితాలు అందాల్సి ఉంది. చైనాలో చదువుకుంటూ ఇక్కడికి వచ్చిన ముగ్గురు కేరళ వైద్య విద్యార్థులు కూడా కోలుకున్నారన్నారు. కోవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌పై సమాచారం కోసం కంట్రోల్ రూమ్ 011–23978046కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ncvo2019@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు. జైపూర్‌కు వచ్చిన ఇటలీ యాత్రికుడొకరికి పరీక్షలు చేయగా అనుమానాస్పద ఫలితాలు వచ్చాయని, మరోసారి అతనికి పరీక్షలు చేయిస్తున్నట్లు రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ మీడియాకు తెలపడం గమనార్హం. -
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్మర్ ప్రవేశాలు
న్యూఢిల్లీ చెన్నై: ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్మర్లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. దేశమంతటా నీట్ కుంభకోణం నీట్ ఎంట్రెన్స్‌లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది. -
శబ్ధరహిత దీపావళి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజధాని నగరంలో శబ్ధ రహితంగా దీపావళి పండుగను జరుపుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర హర్షవర్ధన్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. నివాసిత ప్రాంతాల్లో భారీ శబ్ధం చేసే బాణసంచాను కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్ ఈ మేరకు గురువారం నజీబ్ జంగ్కు ఒక లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఢిల్లీలో మాత్రం అది కనిపించడం లేదని పేర్కొన్నారు. బాణసంచా భారీ పేలుళ్ల శబ్ధం కారణంగా పిల్లలు, వయోవృద్ధులు ఆరోగ్య సంబంధమైన సమస్యలకు గురవుతారని స్వయంగా వైద్యుడైన వర్ధన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పరిపాలన యంత్రాంగం గతంలో సాకులు చెప్పిందని ఆయన ఆరోపించారు. పోలీసు సిబ్బంది సరిపోను లేరని, బాణసంచా పేల్చడం మన సంస్కృతి వంటి కారణాలు వినిపించారని పేర్కొన్నారు. ఈ కారణాలు ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ దీపావళి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీలో మార్పు కనిపించాలని వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2005 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగకు మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగా వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వర్ధన్ కోరారు. బాణసంచా నుంచి వెలువడే శబ్ధ కాలుష్యం వల్ల అన్ని వయస్సుల వారికి భౌతికంగా అసౌకర్యం కలగడంతో పాటు మానసిక రుగ్మతలకు కూడా దారి తీయవచ్చని వర్ధన్ హెచ్చరిం చారు. శబ్ధ కాలుష్యం వల్ల జరిగే అనర్ధాలపై పిల్లలకు అవగాహన కల్పించేం దుకు స్కూళ్లు, కాలేజీలను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.