న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో 69,239 కోవిడ్–19 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30,44,940కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 912 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56,706కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,80,566కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,668గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.24గా ఉంది.
దేశంలో కరోనా రికవరీ రేటు 74.90 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.86 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. తాజా 912 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 297 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 7.67 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల రోజుకు దాదాపుగా 8 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,515 ల్యాబులు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. భారత్ లో కరోనా కేసులు 10 లక్షల నుంచి 20 లక్షలు చేరుకోవడానికి 21 రోజులు పట్టగా, 20 లక్షలు దాటిన 16 రోజుల్లోనే 30 లక్షల మార్కును చేరడం గమనార్హం.
ఏడాది చివరికి వ్యాక్సిన్: హర్షవర్థన్
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు భారత్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తుండగా, ఇంకోటి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా టీకా ప్రయోగాలు మొదటి దశ మానవ ప్రయోగాలను ముగించుకొని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా రెండు, మూడు దశల మానవ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment