యూపీ రాష్ట్రం లక్నోలోని ఆలిండియా రేడియో స్టేషన్‌లో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అలజడి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేవలం ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 20,177 కాగా, 5,914 మంది(21.96 శాతం) బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మొత్తం కరోనా బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఏప్రిల్ 24న 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును తిరగరాస్తూ తాజాగా 1,975 కేసులు బయట పడడం గమనార్హం.
పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్
దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆరోగ్య శాఖా మంత్రి హర్‡్షవర్ధన్ తెలిపారు. చాలా జిల్లాలు హాట్‌స్పాట్ (ప్రమాదకర/అత్యధిక కేసులు నమోదవుతున్న) నుంచి నాన్ హాట్‌స్పాట్లుగా మారుతున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ నివారణ విషయంలో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాగా, గుజరాత్‌లో కరోనా వల్ల ఇప్పటిదాకా 133 మంది మృతిచెందారు. ఎల్–టైప్ వైరస్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలోని వూహాన్‌లో ఈ వైరస్‌నే అలజడి సృష్టించింది. ఎస్–టైప్ కంటే ఎల్–టై‹ప్ వైరస్ మరింత ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెప్పారు.
‘భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ’
కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివృద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment