
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గిపోయే అవకాశం లేదు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ‘సండే సంవాద్’లో భాగంగా ఆయన ఆదివారం సోషల్ మీడియాలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రాబోయే పండుగ సీజన్‌లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరం గా ఉండాలని సూచించారు. పండుగ వేడుకలతో తమను మెప్పించాలంటూ ఏ మతమూ, ఏ దేవుడూ ప్రజలను కోరరని అన్నారు. ఊరేగింపుల్లో పాల్గొని ముప్పు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు.
మన లక్ష్యం.. కరోనా అంతం
త్వరలో ప్రారంభం కానున్న చలికాలంలో కరోనా వ్యాప్తి మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఏ సమాచారమైన పూర్తిగా నిర్ధారించుకోకముందే ఇతరులతో పంచుకోరాదని సూచించారు. కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. అందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొదటి దశలో రూ.3,000 కోట్లు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం
దేశంలో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ఒకటి, రెండు, మూడో దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. కరోనా నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్టు మరికొన్ని వారాల్లో నే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.