న్యూఢిల్లీ చెన్నై: ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్‌మర్‌లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్‌ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు.
దేశమంతటా నీట్ కుంభకోణం
నీట్ ఎంట్రెన్స్‌లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది.
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశాలు
Published Sat, Oct 5 2019 4:24 AM | Last Updated on Sat, Oct 5 2019 4:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment