ముక్కుద్వారా కరోనా టీకా | Serum Institute and Bharat Biotech To Start Nasal Vaccine Trials | Sakshi
Sakshi News home page

ముక్కుద్వారా కరోనా టీకా

Published Tue, Oct 20 2020 4:53 AM | Last Updated on Tue, Oct 20 2020 9:21 AM

Serum Institute and Bharat Biotech To Start Nasal Vaccine Trials - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్‌–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్‌ హర్షవర్ధన్‌ తన సండే సంవాద్‌ కార్యక్రమంలో ప్రకటించారు.

మొత్తం నాలుగు
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ కోవిడ్‌–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్‌ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్‌ కోసం వాషింగ్టన్‌ యూనివర్సి టీ, సెయింట్‌ లూయిస్‌ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్‌ హర్షవర్ధన్‌ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీకి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్‌–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement