ఉన్నతస్థాయి సమావేశానికి హాజరైన హర్షవర్థన్ తదితరులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది. భౌతిక దూరం పాటించడం సహా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది.
రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రుల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఇతర వైద్య ఉపకరణాలను సమకూర్చడం, సిబ్బందికి పీపీఈలను అందించడంపై వారు చర్చించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్, వైరస్ హాట్‌స్పాట్స్ నిర్వహణలను కూడా వారు సమీక్షించారు. కరోనా పరీక్షలను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్స్ వివరాలను కూడా వారికి అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది. కోవిడ్–19కి సంబంధించి ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, పీఐబీ సహా ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్లు అందించే సమాచారాన్నే విశ్వసించాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి మాస్క్‌ను వాడాలనే విషయాన్ని ఆరోగ్య శాఖ వెబ్‌సైట్లో విపులంగా వివరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment