
బీజింగ్: లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరచడం, భౌతిక దూరాన్ని పాటించడం మినహా కరోనాను కట్టడి చేసే మార్గాలు ఏమీ లేవని వూహాన్‌లో ఉన్న భారతీయులు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమకి తాము నిర్బంధంలో ఉంటేనే వైరస్‌ని కట్టడి చేయడం సాధ్యమవుతుందని అన్నారు. కోవిడ్–19 పడగ విప్పినప్పుడు ధైర్యంగా వూహాన్‌లోనే ఉండిపోయిన కొందరు భారతీయులు తమ అనుభవాలను పీటీఐ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘73 రోజుల లాక్‌డౌన్‌ని ఇక్కడ అత్యంత కఠినంగా అమలు చేశారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యాం. అందుకే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం.
భారతీయులందరూ కూడా అదే పని చేయండి. ఇళ్లల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారు’’అని వూహాన్‌లో హైడ్రోబయోలజిస్టుగా పనిచేస్తున్న భారతీయుడు అర్జున్‌జిత్ చెప్పారు. వూహాన్‌లోనే ఉంటున్న మరో భారతీయ శాస్త్రవేత్త కూడా ఇన్ని రోజులు తాను ఇల్లు కదిలి బయటకు రాలేదన్నారు. తన పొరుగింట్లో ఉన్నవారికి చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారని, వాళ్లు కూడా ఎన్నడూ బయటకు రాలేదన్నారు. భారత్‌లో ప్రజలందరూ దీనినే పాటించాలని వారు సూచించారు.