Distance mode
-
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్డౌన్లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది. అయితే, రెడ్ జోన్లలో అత్యవసర వస్తువులను మాత్రమే సరఫరా చేసేందుకు ఈ–కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. రెడ్జోన్లలో నివాసితులు తమ పని మనుషుల విషయంలో ఆ ప్రాంత సంక్షేమ సంఘాల అనుమతి ప్రకారం నడుచుకోవాలని, వారికేమైనా జరిగితే యజమానులదే బాధ్యత. 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ కొన్ని ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) కరోనా సాధికారత బృందాల పునర్వ్యవస్థీకరణ కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన 11 ఉన్నతస్థాయి అధికారిక బృందాలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందాల్లోని కొందరు అధికారులు రిటైర్ కావడమో లేక బదిలీ కావడమో జరిగినందున ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఈ బృందాల విధులు, పరిధులు యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని నిబంధనల సడలింపు ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. పలు రాష్ట్రాలు ఏప్రిల్ 14 తరువాత కనీసం రెండు వారాల లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం మాత్రం కోవిడ్–19ను నిరోధించడం, అదే సమయంలో దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ అధికారి తెలిపారు. భౌతిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులూ ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. ప్రాణాలతోపాటు, జీవనోపాధులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని గత శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రాణముంటే ప్రపంచం ఉంటుందని చెప్పాను. దేశంలోని అధికులు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లోనే ఉండి తమ బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణాలతోపాటు జీవనోపాధులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అని మోదీ ఆ సమావేశంలో వివరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. కార్యాలయాలకు కేంద్ర మంత్రులు.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనువుగా సోమవారం పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. ‘లాక్డౌన్లో ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేశాను. ఈ రోజు శాస్త్రి భవన్‌లోని కార్యాలయానికి తిరిగి వచ్చా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైంది’’అని బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సోమవారం తమ తమ కార్యాలయాలకు వచ్చిన వారిలో ఉన్నారు. జాయింట్ సెక్రటరీలు, అంతకంటే పై స్థాయి అధికారులకు రవాణా సౌకర్యం ఉండటం వల్ల వారు కార్యాలయాలకు రాగా.. రెండు, మూడు, నాలుగో తరగతుల ఉద్యోగులు వంతుల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనంత రక్షణ ఏర్పాట్లతో గుర్తించిన పరిశ్రమలు, సేవలను అందుబాటులోకి తేవాలని దేశీ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక మండలి ఇప్పటికే సూచించింది కూడా. -
లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు. ఏప్రిల్ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తెల్లని వస్త్రంతో చేసిన మాస్క్‌ను ధరించగా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా మాస్క్‌లతో ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్), యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్ ఖట్టర్(హరియాణా), నితీశ్‌కుమార్(బిహార్) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రాణాలూ ముఖ్యమే.. అభివృద్ధీ ముఖ్యమే మొదట లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్డౌన్ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ విద్యార్థులపై దాడులను ప్రధాని ఖండించారు. కోవిడ్ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు. -
భౌతిక దూరం పాటించండి
బీజింగ్: లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరచడం, భౌతిక దూరాన్ని పాటించడం మినహా కరోనాను కట్టడి చేసే మార్గాలు ఏమీ లేవని వూహాన్లో ఉన్న భారతీయులు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమకి తాము నిర్బంధంలో ఉంటేనే వైరస్‌ని కట్టడి చేయడం సాధ్యమవుతుందని అన్నారు. కోవిడ్–19 పడగ విప్పినప్పుడు ధైర్యంగా వూహాన్‌లోనే ఉండిపోయిన కొందరు భారతీయులు తమ అనుభవాలను పీటీఐ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘73 రోజుల లాక్‌డౌన్‌ని ఇక్కడ అత్యంత కఠినంగా అమలు చేశారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యాం. అందుకే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం. భారతీయులందరూ కూడా అదే పని చేయండి. ఇళ్లల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారు’’అని వూహాన్లో హైడ్రోబయోలజిస్టుగా పనిచేస్తున్న భారతీయుడు అర్జున్‌జిత్ చెప్పారు. వూహాన్‌లోనే ఉంటున్న మరో భారతీయ శాస్త్రవేత్త కూడా ఇన్ని రోజులు తాను ఇల్లు కదిలి బయటకు రాలేదన్నారు. తన పొరుగింట్లో ఉన్నవారికి చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారని, వాళ్లు కూడా ఎన్నడూ బయటకు రాలేదన్నారు. భారత్‌లో ప్రజలందరూ దీనినే పాటించాలని వారు సూచించారు. -
కరోనాపై జీఓఎం భేటీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది. భౌతిక దూరం పాటించడం సహా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది. రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రుల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఇతర వైద్య ఉపకరణాలను సమకూర్చడం, సిబ్బందికి పీపీఈలను అందించడంపై వారు చర్చించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్, వైరస్ హాట్‌స్పాట్స్ నిర్వహణలను కూడా వారు సమీక్షించారు. కరోనా పరీక్షలను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్స్ వివరాలను కూడా వారికి అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది. కోవిడ్–19కి సంబంధించి ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, పీఐబీ సహా ఇతర ప్రభుత్వ వెబ్సైట్లు అందించే సమాచారాన్నే విశ్వసించాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి మాస్క్‌ను వాడాలనే విషయాన్ని ఆరోగ్య శాఖ వెబ్సైట్లో విపులంగా వివరించామన్నారు. -
ఓయూ దూరవిద్య బీఈడీలో 86 సీట్లు మిగులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య బీఈడీ (డిస్టెన్స్ మోడ్) కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకా 86 సీట్లు మిగిలి నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన ఆసక్తి గల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నాలుగు రోజుల్లో మిగిలిన సీట్లలో చేరవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9440567567 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.