న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్‌డౌన్‌లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్ కంటైన్‌మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు)
మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది. అయితే, రెడ్ జోన్లలో అత్యవసర వస్తువులను మాత్రమే సరఫరా చేసేందుకు ఈ–కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. రెడ్‌జోన్లలో నివాసితులు తమ పని మనుషుల విషయంలో ఆ ప్రాంత సంక్షేమ సంఘాల అనుమతి ప్రకారం నడుచుకోవాలని, వారికేమైనా జరిగితే యజమానులదే బాధ్యత. 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ కొన్ని ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది)
కరోనా సాధికారత బృందాల పునర్వ్యవస్థీకరణ
కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన 11 ఉన్నతస్థాయి అధికారిక బృందాలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందాల్లోని కొందరు అధికారులు రిటైర్ కావడమో లేక బదిలీ కావడమో జరిగినందున ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఈ బృందాల విధులు, పరిధులు యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’)
Comments
Please login to add a commentAdd a comment