సాక్షి, అమరావతి: కరోనా దెబ్బకు మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. మద్యం ప్రియులకు మందు చుక్క నోట్లో పడి నెల రోజులు దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది గూగుల్‌ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. గడచిన నెల రోజుల్లో దేశవ్యాప్తంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాల్లో మద్యానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మార్చి 22 నుంచి 28వ తేదీ వరకు.. ఏప్రిల్ 12 నుంచి 18వ తేదీ వరకు మద్యం సంబంధిత అంశాలపై సెర్చింగ్ పీక్ లెవల్ (టాప్ ట్రెండింగ్)లో ఉన్నట్లు తేలింది. గూగుల్ ట్రెండ్స్ ఇండియా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తెగ వెతికేస్తున్నారు
► మద్యం ఎక్కడ దొరుకుతుంది.. ఆన్‌లైన్ మార్కెట్‌లో మద్యం అమ్ముతున్నారా..? బ్లాక్‌లో ఎక్కడ విక్రయిస్తున్నారు..? విస్కీ తయారీ ఎలా..? తక్కువ ఆల్కాహాల్ శాతం ఉండే బీరును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు? అనే అంశాల్ని నెటిజన్లు వెతుకుతున్నారు.
► మద్యానికి సంబంధించిన అన్ని అంశాలనూ గూగుల్‌లో వెతకడంలో కేంద్రపాలిత ప్రాంతాలైన గోవా, పాండిచ్చేరి, డయ్యూ అండ్ డామన్, కర్ణాటక, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, సిక్కిం, చండీగఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరుస పది స్థానాల్లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో నిలిచింది.
► మద్యం తయారీ ఎలా అనే అంశాన్ని సెర్చ్ చేసిన రాష్ట్రాల్లో మణిపూర్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అసోం, ఆంధ్రప్రదేశ్ వరుస ఆరు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ పదో స్థానంలో ఉంది.
► బీరు తయారీ ఎలా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గూగుల్‌లో శోధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, కేరళ, హరియాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.
మందుబాబులు గత 30 రోజులుగా మద్యం కోసం గూగుల్ సెర్చ్‌లో వెతకడాన్ని తెలుపుతున్న గ్రాఫ్
వీటిపైనా ఆసక్తి అధికమే
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇంటర్నెట్‌లో అంశాలను శోధిస్తూ.. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యంతోపాటు భారతీయులు అత్యధికంగా వెతికిన 30 అంశాలు ఇవీ..
► కరోనా వైరస్ టిప్స్, కరోనా వైరస్, లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్, కోవిడ్–19, హైడ్రాక్సీ క్లోరోక్విన్.
► కరోనా వైరస్ సింప్టమ్స్, ఆరోగ్యసేతు యాప్, లాక్‌డౌన్, ఆరోగ్య సేతు, కరోనా వైరస్ ప్రివెన్షన్.
► ఇండియా కోవిడ్–19 ట్రాకర్, ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్, లాక్‌డౌన్ ఇన్ ఇండియా, బీసీజీ వ్యాక్సిన్.
► ఎంహెచ్‌ఏ గైడ్‌లైన్స్, కరోనా అప్ డేట్ ఇన్ ఇండియా, కోవిడ్–19 ట్రాకర్, లేటెస్ట్ కరోనా వైరస్ న్యూస్, కరోనా వైరస్ ట్రీట్మెంట్.
► లాక్‌డౌన్ న్యూస్, కోవిడ్–19 ఇండియా, పీపీఈ కిట్, హెచ్‌సీక్యూ (హైడ్రాక్సీ క్లోరోక్విన్), ఇవర్ మెక్టిన్ (మెడిసిన్).
► లాక్‌డౌన్ ఎక్స్‌టెండెడ్, హాట్‌స్పాట్, లాక్‌డౌన్ ఇన్ ఢిల్లీ, లాక్‌డౌన్ లేటెస్ట్ న్యూస్, ఇండియా లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్.
Comments
Please login to add a commentAdd a comment