మందుబాబులు ఎగబడ్డారు! | COVID-19: Government allows liquor shops to reopen | Sakshi
Sakshi News home page

మందుబాబులు ఎగబడ్డారు!

Published Tue, May 5 2020 4:15 AM | Last Updated on Tue, May 5 2020 4:15 AM

COVID-19: Government allows liquor shops to reopen - Sakshi

ఢిల్లీలో ఓ దుకాణం నుంచి రెండు చేతుల నిండా మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న ఓ వ్యక్తి

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటి వరకు క్రమశిక్షణతో గడిపిన జనం.. ఒక్కసారిగా కట్టు తప్పారు. భౌతిక దూరం నిబంధనలను పక్కనబెట్టారు. గుంపులుగా చేరి గొడవలకు దిగారు. వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు 40 రోజుల తర్వాత తిరిగి సోమవారం తెరుచు కోవడంతో చాలా రాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలివీ..! మూడో విడత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించిన కేంద్రం మద్యం దుకాణాలు తదితరాలకు వెసులుబాటునిచ్చింది. షాపుల వద్ద కొనుగోలు దారులు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలనీ, ఐదుగురికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టింది.

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే జనం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకపోవడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి మందుబాబులను అదుపు చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని సుమారు 150 మద్యం దుకాణాలు సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేశాయి. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా 26 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు లిక్కర్‌ కోసం బాహాబాహీకి దిగారు. మొదటి రోజు విక్రయాలతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజయ్‌రెడ్డి తెలిపారు. 

కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుకాని చోట్ల మద్యం దుకాణాలను తెరుస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం ముంబై, పుణేల్లోని షాపుల వద్ద కొనుగోలు దారులు క్యూ కట్టారు. కానీ, దుకాణాలను తెరవకపోవడంతో నిరాశచెందారు. షాపులను మూసి ఉంచాలంటూ తాము ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో జనం భారీగా చేరడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. రెడ్‌ జోన్‌లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాలకు తొందరపడి అనుమతివ్వడంపై కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ వ్యాప్తికి ఊతమిచ్చేలా జనం గుమికూడుతున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని కోరారు.

ఢిల్లీలో మద్యం దుకాణం వద్ద గుమికూడిన జనంపైకి లాఠీ ఝళిపిస్తున్న పోలీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement