న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్ సహా పలు కారణాలతో కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ పుంజుకునే ప్రయత్నాల్లో పడింది. వేసవి సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పటిదాకా మూతబడిన షోరూమ్‌లను, నిల్చిపోయిన ఉత్పత్తిని కంపెనీలు పునఃప్రారంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తిరిగి ప్రారంభించినట్లు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) బుధవారం వెల్లడించింది. వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టినట్లు వివరించింది.
అలాగే, వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేలా అవుట్‌లెట్స్ కొత్త ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు, డిజిటల్ సౌలభ్యాన్ని సైతం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఈడీ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సుమారు 600 డీలర్‌షిప్‌లను తెరవగలిగాం. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన అనుమతుల కోసం డీలర్లు దరఖాస్తు చేసుకున్నారు‘ అని వివరించారు. ఇప్పటికే 55 వాహనాలు డెలివరీ కూడా చేసినట్లు చెప్పారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 1,960 నగరాలు, పట్టణాల్లో 3,080 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. తాజాగా తెరిచిన వాటిల్లో 474 ఏరీనా అవుట్‌లెట్స్, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అవుట్‌లెట్స్ ఉన్నాయని శ్రీవాస్తవ చెప్పారు. కార్లకు డోర్ స్టెప్ డెలివరీ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు.
ఉత్పత్తి మొదలు..
దేశవ్యాప్తంగా తమ ఫ్యాక్టరీలన్నింటిలోనూ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ వెల్లడించింది. హోసూరు, మైసూరు, నాలాగఢ్‌లోని ఫ్యాక్టరీల్లో కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో వివరించింది. అటు, మారుతీ సుజుకీ తమ మానెసర్ ప్లాంటులో ఉత్పత్తిని మే 12 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్ సైతం పుణేలోని చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిమిత సంఖ్యలో సిబ్బందితో మొదలుపెట్టినట్లు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు కూడా కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇక యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా సైతం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంటులో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు వెల్లడించింది. తయారీకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ ప్రారంభం
చెన్నై: ఐచర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న ఒరగాడమ్ తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు చెన్నైలోని ఒరగాడమ్‌తోపాటు, తిరువొత్తియార్, వల్లమ్ వడగల్ వద్ద కూడా ప్లాంట్లు ఉన్నాయి. తొలుత ఒరగాడమ్ ప్లాంట్‌లో కొద్ది మంది సిబ్బందితో ఒకే షిఫ్ట్‌గా పనులు ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది. తిరువొత్తియార్, వడగల్ ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. షోరూ ములు పాక్షికంగా కార్యకలా పాలు మొదలయ్యా యని, 10 రోజుల్లో దాదాపు 300 షోరూమ్‌లు షురూ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే బాటలో హ్యుందాయ్..
వివిధ రాష్ట్రాల్లో 250 దాకా కంపెనీ డీలర్‌షిప్‌లు కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఉన్నాయని పేర్కొంది. కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 500 పైచిలుకు డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ‘రెండు రోజులుగా వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టాం. పెండింగ్ బుకింగ్స్ చాలా ఉన్నాయి. డీలర్ల దగ్గరున్న నిల్వలు వీటికి సరిపోతాయి‘ అని సంస్థ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గర్గ్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లోని డీలర్లు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, రాగానే కార్యకలాపాలు ప్రారంభిస్తారని వివరించారు. కరోనా కష్టకాలంలో కొనుగోలుదారులు ఈఎంఐల గురించి ఆందోళన చెందకుండా కొన్ని కార్ల మోడల్స్‌పై ఈఎంఐ అష్యూరెన్స్ పేరిట ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని గర్గ్ చెప్పారు.
హోండాకు సిబ్బంది సమస్యలు..
తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తెలిపింది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌కి అనుమతులు గతవారమే వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. వచ్చే వారం కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అనుమతులు, సిబ్బంది కొరత సమస్యలను అధిగమించాకా గ్రేటర్ నోయిడా ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభించగలమని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. అటు, డీలర్‌షిప్‌ల్లో కొన్ని తిరిగి తెరుచుకున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment