heavy line
-
మందుబాబులు ఎగబడ్డారు!
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటి వరకు క్రమశిక్షణతో గడిపిన జనం.. ఒక్కసారిగా కట్టు తప్పారు. భౌతిక దూరం నిబంధనలను పక్కనబెట్టారు. గుంపులుగా చేరి గొడవలకు దిగారు. వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు 40 రోజుల తర్వాత తిరిగి సోమవారం తెరుచు కోవడంతో చాలా రాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలివీ..! మూడో విడత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించిన కేంద్రం మద్యం దుకాణాలు తదితరాలకు వెసులుబాటునిచ్చింది. షాపుల వద్ద కొనుగోలు దారులు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలనీ, ఐదుగురికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టింది. ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే జనం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకపోవడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి మందుబాబులను అదుపు చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని సుమారు 150 మద్యం దుకాణాలు సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేశాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 26 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు లిక్కర్ కోసం బాహాబాహీకి దిగారు. మొదటి రోజు విక్రయాలతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌రెడ్డి తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలుకాని చోట్ల మద్యం దుకాణాలను తెరుస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం ముంబై, పుణేల్లోని షాపుల వద్ద కొనుగోలు దారులు క్యూ కట్టారు. కానీ, దుకాణాలను తెరవకపోవడంతో నిరాశచెందారు. షాపులను మూసి ఉంచాలంటూ తాము ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో జనం భారీగా చేరడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. రెడ్ జోన్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాలకు తొందరపడి అనుమతివ్వడంపై కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తికి ఊతమిచ్చేలా జనం గుమికూడుతున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ఢిల్లీలో మద్యం దుకాణం వద్ద గుమికూడిన జనంపైకి లాఠీ ఝళిపిస్తున్న పోలీస్ -
టెండర్ల కిక్కు
– కిక్కిరిసిన సూపరింటెండెంట్ కార్యాలయం – నేడు విద్యుత్ కళాభారతిలో లాటరీ ద్వారా టెండర్ల ఖరారు – అమల్లో 144 సెక్షన్ అనంతపురం సెంట్రల్ : మద్యం షాపుల కోసం టెండర్‌దారులు ఎగబడ్డారు. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం చివరిరోజు కావడంతో విద్యుత్‌నగర్ సర్కిల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం కిటకిటలాడింది. వేలాది మంది టెండర్‌దారులు వచ్చి దరఖాస్తులను సరిచూసుకున్నారు. జిల్లాలో 246 మద్యం దుకాణాలకు రెండేళ్లకు సంబంధించి టెండర్ ఆహ్వానించిన విషయం విదితమే. గురువారం రాత్రి‡ 8 గంటల వరకూ ఆన్లైన్ ద్వారా టెండర్లు స్వీకరణ, వెరిఫికేషన్‌కు గడువు విధించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టభద్రత కల్పించారు. గురు, శుక్రవారాల్లో 144 సెక్షన్లో అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 246 షాపులకు 6,962 మంది దరఖాస్తు తొలి రెండు రోజులు పెద్దగా ఆసక్తి చూపని టెండర్‌దారులు చివరి రెండు రోజులు అనూహ్యరీతిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు రుసుం కింద గురువారం నాటికి రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 246 షాపులకు ఆన్లైన్ ద్వారా టెండర్ దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికోసం 6,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రతి మద్యం షాపునకు దరఖాస్తులు వచ్చాయి. గురువారం రాత్రి 9 గంటల వరకూ 5,650 మంది వెరిఫికేషన్ కూడా చేయించుకున్నారు. మిగిలిన వారికి రాత్రి 12 గంటల వరకూ గడువు విధించారు. ఆలోగా వెరిఫికేషన్ చేయించుకోని వారి దరఖాస్తులను రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. నేడు లాటరీ మద్యం దుకాణాలకు వచ్చిన టెండర్లను శుక్రవారం ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. . గుత్తిరోడ్డులోని విద్యుత్ కళాభారతి ఫంక్షన్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో టెండర్ ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.