ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు.
వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు.
ప్రస్తుతం 20 వ్యాక్సిన్‌లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్‌ఫర్డ్–సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత)
క్రిస్మస్‌కు ముందే వ్యాక్సిన్!
ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్‌లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్‌లో వ్యాక్సిన్‌కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్‌మస్‌కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్‌లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు.
వృద్ధుల్లో ఆక్స్‌ఫర్డ్ టీకా సత్ఫలితాలు
లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్‌లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment