ఆరోగ్య మంత్రి హర్షవర్థన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణల్లో రెండు కోవిడ్ కేసులు తాజాగా వెలుగుచూశాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ బాధితుడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారని, అలాగే తెలంగాణకు చెందిన ఒకరు దుబాయ్ నుంచి వచ్చారని పేర్కొంది. ‘ప్రస్తుతం ఒకరు ఢిల్లీ ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో, మరొకరు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉన్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉన్న 3,217 మంది శాంపుల్స్ పరీక్షించగా ఐదుగురిలో కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, మరో 32 శాంపుల్స్ ఫలితాలు అందాల్సి ఉంది.
చైనాలో చదువుకుంటూ ఇక్కడికి వచ్చిన ముగ్గురు కేరళ వైద్య విద్యార్థులు కూడా కోలుకున్నారన్నారు. కోవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌పై సమాచారం కోసం కంట్రోల్ రూమ్ 011–23978046కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ncvo2019@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు. జైపూర్‌కు వచ్చిన ఇటలీ యాత్రికుడొకరికి పరీక్షలు చేయగా అనుమానాస్పద ఫలితాలు వచ్చాయని, మరోసారి అతనికి పరీక్షలు చేయిస్తున్నట్లు రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ మీడియాకు తెలపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment