PUC
-
పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు..
వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పొందేందుకు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పనిసరి అన్న 2017 ఆగస్టు 10 నాటి ఆర్డర్ ద్వారా విధించిన షరతును సుప్రీంకోర్టు తొలగించింది.జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 2017 ఆర్డర్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రమాద బాధితులు నేరుగా వాహన యజమానుల నుంచి నష్టపరిహారం కోరుతున్నారని, కానీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడంతో వాహన యజమానులు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.వాహన బీమా పాలసీ పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అని మోటారు వాహనాల చట్టం, 1988 కానీ దాని కింద రూపొందించిన మరే ఇతర చట్టం కానీ నిబంధనలు విధించలేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాలు ఎప్పటికప్పుడు పీయూసీ సర్టిఫికెట్లను కలిగి ఉండేలా ఈ షరతు విధించామని, దీనికి మరింత సమర్థవంతమైన పరిష్కారం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. కాగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాహనాలను ట్రాక్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోర్టు సూచించింది.థర్డ్-పార్టీ వాహన బీమా కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ 2017లో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలనే ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు గతంలోనే వ్యక్తం చేసింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ విస్మరిస్తున్న వాహనదారులు 55% మంది ఉన్నారని, దీంతో ప్రమాద క్లెయిమ్‌లు పరిహారం పొందడం కష్టంగా మారిందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని కొనసాగిస్తూనే వాహనం పీయూసీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా బ్యాలెన్స్డ్ విధానం అవసరమని కోర్టు అంగీకరించింది. -
వాహనదారులకు షాక్.. 80 శాతం పెరగనున్న పీయూసీ సర్టిఫికేట్ చార్జీలు
భారతదేశంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న తరుణంలో రవాణా శాఖ 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (పియుసి) సర్టిఫికేట్ల కోసం చార్జీలను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచనున్నట్లు, దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. 2011 నుంచి PUC చార్జీలు పెంచలేదని.. రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు. కొత్త రేట్లు అమల్లోకి వస్తే ధరలు మునుపటి కంటే దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు రవాణా మంత్రి 'కైలాష్ గహ్లోట్' తెలిపారు. కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం, ప్రతి వాహనం నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పీయూసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీలో PUC ప్రూఫ్ పీజు ద్విచక్ర వాహనాలకు రూ.60, పెట్రోల్ ఫోర్ వీలర్ల కోసం రూ. 80, డీజిల్ ఫోర్ వీలర్స్ కోసం రూ. 100. ఈ రేటుపైన 18 శాతం GST కూడా వసూలు చేస్తారు. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో సుమారు 85 శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 27.8 లక్షల కార్లకు, 69.8 లక్షల టూ వీలర్లకు పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంబంధిత శాఖ ఇలాంటి వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. -
పేదింట ఆణిముత్యం
పీయూసీలో రాష్ట్రంలో ఫస్టు ర్యాంకర్ అంటే లక్షల ఫీజులు కట్టి, కార్పొరేట్ కాలేజీల్లో చదివేవారై ఉంటారు. వారి తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగులో, సంపన్నులో అయి ఉంటారని అనుకుంటారు. 24 గంటలూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ర్యాంక్ సాధిస్తారనుకోవచ్చు. కానీ బళ్లారి జిల్లాలో ఓ పేదింటి ఆణిముత్యం మామూలు కాలేజీలో చదువుకుంటూ, తండ్రికి సైకిల్‌షాపులో చేదోడుగా ఉంటూనే టాపర్‌గా అవతరించింది. ఆర్ట్స్‌లో ఫస్ట్ ర్యాంకర్ అయ్యింది. బళ్లారి టౌన్: సైకిళ్లకు, బైక్‌లకు పంక్చర్ వేస్తూ కష్టపడి చదివిన బాలిక ద్వితీయ పీయూసీలో ఆర్ట్స్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించి కాలేజీకి, గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో వాల్మీకీ కాలనీలో నివసిస్తున్న విద్యార్థిని కుసుమ ఉజ్జిని స్థానిక ప్రయివేట్ హిందూ పీయూ కళాశాలలో ద్వితీయ పీయూసీ. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఏకంగా ఫస్ట్ ర్యాంక్ సాధించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 600కు గాను 594 మార్కులు సాధించింది. కన్నడ భాష, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లలో నూటికి నూరు మార్కులు, ఎజ్యుకేషన్‌లో 99, సంస్కృతంలో 99, కన్నడలో 96 మార్కులు కైవసం చేసుకుంది. దీంతో కన్నవారి ఆనందానికి అవధులు లేవు. సోమవారం పంక్చర్ షాపులో తండ్రికి సహాయం చేస్తున్న కుసుమ ఉజ్జిని ర్యాంకుపై తపనతో చదివా: కుసుమ తండ్రి దేవేంద్రప్ప చిన్న పంక్చర్ షాపు నడుపుతున్నాడు. ఆమె కాలేజీ విరామం, సెలవు రోజులలో షాపులో కూర్చుని తండ్రికి సహాయంగా పనిచేసేది. కుసుమ పదవ తరగతిలోను 92 శాతం మార్కులు సాధించింది. పీయుసీలో ఎలాగైనా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాలే తపనతోనే చదివానని కుసుమ తెలిపింది. బాగా చదివి ప్రభుత్వ అధికారి కావాలని ఉందని పేర్కొంది. కాగా, గత 5ఏళ్లుగా కొట్టూర్ హిందూ పీయూ కళాశాల విద్యార్థులు ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా సాధిస్తూ తమ కళాశాల కీర్తిని చాటుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రప్ప పేర్కొన్నారు. -
లీకేజీ కారకులు తప్పించుకోలేరు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: పీయూసీ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరించారు. లీకేజీకి పాల్పడిన వారు ఎంత ప్రాబల్యం కలిగిన వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంగళవారమిక్కడి విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాలార్పణ చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శర ణ ప్రకాష్ పాటిల్ పీఏ లీకేజీ వ్యవహారంలో భాగస్వామిగా మారిన వైనం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అతడిని ఇప్పటికే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఇక చట్టం ఎదుట ఎవరూ పెద్దవారు కాదని, లీకేజీ వ్యవహారంలో భాగస్వాములైన వారందరినీ శిక్షించి తీరతామని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రి వర్గ పునఃనిర్మాణానికి సంబంధించి హైకమాండ్‌తో చర్చించేందుకు గాను త్వరలోనే ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. -
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోలు
సాక్షి, న్యూఢిల్లీ: మీ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేనట్లయితే పెట్రోలు పంపు నిర్వాహకులు మీ వాహనంలో ఇంధనం నింపడానికి నిరాకరించే రోజులు త్వరలో రానున్నాయి. బంకు పెట్రోలు పోయించుకోవాలంటే వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ తప్పక ఉండాలనే ప్రతిపాదనకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆమోదం తెలిపారు. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్న సంగతి తెల్సిందే. దీంతో ఢిల్లీలో కాలుష్య స్థాయిని నియంత్రించేందుకు సిఫారసులు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పీయూసీ సర్టిఫికెట్ కలిగిన వాహనంలోనే పెట్రోలు నింపాలన్న నియమం విధించాలని సిఫారసు చేసింది. ఈ నియమాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్నదానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ నవంబర్ నెలలో దీనిని అమలు చేయవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేలోగా నగరంలో తగినన్ని పెట్రోలు పంపులలో పీయూసీ సరిఫికెట్ జారీ చేసే సదుపాయం ఉండేలా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని 80 శాతం పెట్రోలు పంపులలో వాహనాల కాలుష్య స్థాయిని పరీక్షించి పీయూసీ సర్టిఫికెట్ జారీచేసే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగతా 20 శాతం పెట్రోలు పంపులలో కూడా ఈ సదుపాయం లభించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే రద్దీగా సమయాల్లో బంకుల వద్ద పీయూసీ సర్టిఫికెట్లు చూసిన తరువాతే వాహనాలలో పెట్రోలు నింపడం సమస్య కావచ్చని, ఇది కస్టమర్లకు, సిబ్బందికి మధ్య వాదనలకు, ఘర్షణలకు దారితీయవచ్చని యజమానులు అంటున్నారు. పెట్రోలు అత్యవసర సరుకులలో ఒకటని, పీయూసీ లేదన్న కారణంతో పెట్రోలు నింపడానికి నిరాకరించ లేమని ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన అనురాగ్ నారాయణ్ అంటున్నారు. దీనికన్నా నగరంలో చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు జరిపి పీయూసీ లేనివాహనం నడిపేవారికి చలాన్లు విధించినట్లయితే మేలని ఆయన సూచించారు. -
పెట్రోల్ కావాలంటే పీయూసీ చూపాల్సిందే!
న్యూఢిల్లీ: నగరవాసులు ఇకపై వాహనాలపై తిరిగేటప్పుడు తప్పకుండా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తమతోపాటు ఉంచుకోవాల్సిందే.. వాహనానికి పెట్రోలుగానీ, డీజిల్ గానీ పోయించుకోవాలనుకుంటే వారు ఇకపై పొల్యూషన్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాహనం నుంచి వెలువడుతున్న వాయువులు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే ఇంధనం నింపాలని పెట్రోల్, డీజిల్ బంకులకు ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో కొన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటినుంచి వెలువడుతున్న వ్యర్థాలతో నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఇకపై పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉన్న వాహనాలకే పెట్రోల్, డీజిల్ పోయాలనే నిబంధనను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అమలులోకి రావడానికి ఇంకా రెండునెలల సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఈ నిబంధనపై నగరంలో విస్తృతంగా ప్రచారంచేసి, వాహనదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. నగరంలో ఉన్న అన్ని పెట్రోల్, డీజిల్ బంక్‌ల వద్ద ప్రచార వాల్‌పోస్టర్లను అంటించనున్నారు. అలాగే ఆయా బంక్‌ల వద్ద కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటివరకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ తీసుకోనివాల్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. నిర్ణయం అమల్లోకి వచ్చాక.. బంకుల్లో పీఎస్ చూపిస్తేనే పెట్రోలుగాని, డీజిల్ గాని పోస్తారు.