విద్యార్థిని కుసుమతో తల్లిదండ్రులు
పీయూసీలో రాష్ట్రంలో ఫస్టు ర్యాంకర్ అంటే లక్షల ఫీజులు కట్టి, కార్పొరేట్ కాలేజీల్లో చదివేవారై ఉంటారు. వారి తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగులో, సంపన్నులో అయి ఉంటారని అనుకుంటారు. 24 గంటలూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ర్యాంక్ సాధిస్తారనుకోవచ్చు. కానీ బళ్లారి జిల్లాలో ఓ పేదింటి ఆణిముత్యం మామూలు కాలేజీలో చదువుకుంటూ, తండ్రికి సైకిల్‌షాపులో చేదోడుగా ఉంటూనే టాపర్‌గా అవతరించింది. ఆర్ట్స్‌లో ఫస్ట్ ర్యాంకర్ అయ్యింది.
బళ్లారి టౌన్: సైకిళ్లకు, బైక్‌లకు పంక్చర్ వేస్తూ కష్టపడి చదివిన బాలిక ద్వితీయ పీయూసీలో ఆర్ట్స్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించి కాలేజీకి, గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో వాల్మీకీ కాలనీలో నివసిస్తున్న విద్యార్థిని కుసుమ ఉజ్జిని స్థానిక ప్రయివేట్ హిందూ పీయూ కళాశాలలో ద్వితీయ పీయూసీ. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఏకంగా ఫస్ట్ ర్యాంక్ సాధించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 600కు గాను 594 మార్కులు సాధించింది. కన్నడ భాష, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లలో నూటికి నూరు మార్కులు, ఎజ్యుకేషన్‌లో 99, సంస్కృతంలో 99, కన్నడలో 96 మార్కులు కైవసం చేసుకుంది. దీంతో కన్నవారి ఆనందానికి అవధులు లేవు.
సోమవారం పంక్చర్ షాపులో తండ్రికి సహాయం చేస్తున్న కుసుమ ఉజ్జిని
ర్యాంకుపై తపనతో చదివా: కుసుమ
తండ్రి దేవేంద్రప్ప చిన్న పంక్చర్ షాపు నడుపుతున్నాడు. ఆమె కాలేజీ విరామం, సెలవు రోజులలో షాపులో కూర్చుని తండ్రికి సహాయంగా పనిచేసేది. కుసుమ పదవ తరగతిలోను 92 శాతం మార్కులు సాధించింది. పీయుసీలో ఎలాగైనా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాలే తపనతోనే చదివానని కుసుమ తెలిపింది. బాగా చదివి ప్రభుత్వ అధికారి కావాలని ఉందని పేర్కొంది. కాగా, గత 5ఏళ్లుగా కొట్టూర్ హిందూ పీయూ కళాశాల విద్యార్థులు ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా సాధిస్తూ తమ కళాశాల కీర్తిని చాటుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రప్ప పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment