Third party insurance
-
పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు..
వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పొందేందుకు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పనిసరి అన్న 2017 ఆగస్టు 10 నాటి ఆర్డర్ ద్వారా విధించిన షరతును సుప్రీంకోర్టు తొలగించింది.జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 2017 ఆర్డర్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రమాద బాధితులు నేరుగా వాహన యజమానుల నుంచి నష్టపరిహారం కోరుతున్నారని, కానీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడంతో వాహన యజమానులు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.వాహన బీమా పాలసీ పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అని మోటారు వాహనాల చట్టం, 1988 కానీ దాని కింద రూపొందించిన మరే ఇతర చట్టం కానీ నిబంధనలు విధించలేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాలు ఎప్పటికప్పుడు పీయూసీ సర్టిఫికెట్లను కలిగి ఉండేలా ఈ షరతు విధించామని, దీనికి మరింత సమర్థవంతమైన పరిష్కారం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. కాగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాహనాలను ట్రాక్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోర్టు సూచించింది.థర్డ్-పార్టీ వాహన బీమా కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ 2017లో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలనే ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు గతంలోనే వ్యక్తం చేసింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ విస్మరిస్తున్న వాహనదారులు 55% మంది ఉన్నారని, దీంతో ప్రమాద క్లెయిమ్‌లు పరిహారం పొందడం కష్టంగా మారిందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని కొనసాగిస్తూనే వాహనం పీయూసీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా బ్యాలెన్స్డ్ విధానం అవసరమని కోర్టు అంగీకరించింది. -
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం.. 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది. గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది. ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు. అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది. -
విపత్తుల్లోనూ బీమా ధీమా!
వరద నీటికి బెంగళూరులోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడం చూశాం. సంపన్నులు ఉండే ప్రాంతాలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్ల రూపాయలు పలికే ఖరీదైన విల్లాలు, కార్లు సగం మేర నీటిలో మునగడం కనిపించింది. ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తులకు కలిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. కరోనా మహమ్మారి ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలియజేసినట్టే.. బెంగళూరు వరదలు హోమ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని గుర్తు చేశాయని చెప్పుకోవాలి. కొంచెం ప్రీమియంతోనే ఇలాంటి అనుకోని ఉపద్రవాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. మోటారు బీమా థర్డ్ పార్టీ కవరేజీకే పరిమితం కాకుండా సమగ్ర కవరేజీ తీసుకోవాలి. అలాగే, హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది. వీటి గురించి వివరించే కథనం ఇది... కాంప్రహెన్సివ్... మోటారు బీమా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సమగ్ర కవరేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సొంత వాహనానికి నష్టం జరిగితే పరిహారం రావాలంటే సమగ్ర కవరేజీ ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వల్ల తమ వాహనాలకు జరిగే నష్టానికి కాంప్రహెన్సివ్ పాలసీలోనే పరిహారం లభిస్తుంది. అలాగే, వాహనం చోరీ, ప్రమాదంలో నష్టం, అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టానికి పరిహారం కోరొచ్చు. వరదల వల్ల కార్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కారు విలువ కూడా పడిపోతుంది. ఖరీదైన రీపేర్లు అవసరం పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసినా దెబ్బతిన్న కారు బాగు కాకపోవచ్చు. సమగ్ర కారు బీమా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వెనుకాడొద్దని.. ఇలాంటి ఊహించని నష్టాలను గట్టెక్కడానికి ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్రహెన్సివ్ ప్లాన్లలో మళ్లీ ఇంజన్, గేర్ బాక్స్‌కు ఎక్కువ కంపెనీలు కవరేజీ ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో విడిగా యాడాన్ కవరేజీలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయా అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ ప్రొటెక్షన్ కవర్: కారు ఇంజన్ వాడకపోయినా పాడవుతుంది. వరద నీటి కారణంగానూ దెబ్బతింటుంది. ఇంజన్‌ను పూర్తిగా మార్చేయాలన్నా లేక ఇంజన్లో విడిభాగాలను మార్చాలన్నా అలాంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అక్కరకు వస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్: వరద నీరు కారణంగా రిపేర్ చేయడానికి వీలు లేకుండా కారు దెబ్బతింటే లేదా కారు చోరీకి గురైనా.. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఉన్న వారు కారు కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని (బిల్లులో ఉన్న మేర) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ కవర్: వాడుకలో కాలం గడిచే కొద్దీ వాహనం, అందులోని విడిభాగాల విలువ తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల నుంచి క్లెయిమ్ వస్తే, బీమా కంపెనీలు తరిగిపోయిన విలువ మినహాయించి, మిగిలిన మేరే చెల్లిస్తాయి. కానీ, జీరో డిప్రీసియేషన్ కవర్ తీసుకుంటే ఇలాంటి కోతలు ఏవీ లేకుండా బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇతర కవరేజీలు: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్, ఇంజన్ ఆయిల్, గ్రీజ్ తదితర వాటికి చెల్లింపులు చేసే కన్జ్యూమబుల్ కవర్, రోడ్డు సైడ్ అసిస్టెన్స్ అందించే కవర్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్లెయిమ్ దాఖలు ఎలా... వరదల వల్ల కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ నీటిలో మునిగిపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, స్టార్ట్ చేసినా కానీ, అవి ఆన్ కాకపోవచ్చు. కానీ, వాహనాన్ని కదిలించినట్టయితే మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాహనదారు చర్యలతో మరింత నష్టం జరిగితే బీమా సంస్థ నుంచి తిరస్కారం ఎదురుకావచ్చు. దీనికి బదులు బీమా సంస్థకు వాస్తవ సమాచారాన్ని తెలియజేయడమే మంచి నిర్ణయం అవుతుంది. తమ వాహనానికి జరిగిన నష్టాన్ని తేల్చాలని కోరొచ్చు. దాంతో బీమా సంస్థ సర్వేయర్‌ను, మెకానిక్‌ను సంఘటన స్థలానికి పంపిస్తుంది. వరదనీరు తగ్గిపోయిన తర్వాత వారు వచ్చి జరిగిన నష్టంపై అంచనాకు వస్తారు. లేదంటే వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్‌కు తరలిస్తారు. అనంతరం ఇంజన్‌ను తనిఖీ చేయడం, ఇంజన్ ఫ్లషింగ్, క్లీనింగ్ చేయించొచ్చు. ఇంజన్‌కు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే నష్టాన్ని వాహనదారుడే మోయాల్సి వస్తుంది. అందుకనే వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని స్టార్ట్ చేయడానికి బదులు టోయింగ్ వ్యాన్‌తో తరలించి, నష్టాన్ని మదింపు చేయించడమే సరైనది అవుతుంది. బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో జాప్యం లేకుండా జాగ్రత్తపడాలి. బెంగళూరులో వరదల వల్ల వస్తున్న క్లెయిమ్‌లలో 80 శాతం విడిభాగాలకు నష్టానికి సంబంధించినవి అయితే, మరో 20 శాతం పూర్తి డ్యామేజీ క్లెయిమ్‌లు ఉంటున్నట్టు బీమా సంస్థలు తెలిపాయి. హోమ్ ఇన్సూరెన్స్ సంగతేంటి? సొంతిల్లు పట్ల ఎంతో మమకారం ఉంటుంది. ఈ రోజుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే కానీ సొంతిల్లు సమకూరడం లేదు. అంతటి విలువైన ఇంటికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ముంబై, చెన్నై, ఇప్పుడు బెంగళూరు నగరాలు వరద ముప్పును ఏ స్థాయిలో ఎదుర్కొన్నదీ చూశాం. కనుక విలువైన ఇంటికి, ఇంట్లోని విలువైన సామగ్రికి బీమా రక్షణ తీసుకోవడం ఎంతో లాభం. ఇంటి యజమానులే అని కాదు, అద్దెకు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అద్దెకు ఉండే వారు ఇంట్లోని వాటికి మాత్రమే కవరేజీ తీసుకుంటే చాలు. అదే ఇంటి యజమాని అన్ని రకాల కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉండే రిస్క్‌ల గురించి పూర్తి అవగాహనతో ఉంటే, ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తేల్చుకోవచ్చు. ప్రకృతి విపత్తులు (అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం) లేదా ప్రమాదవశాత్తూ వాటిల్లిన నష్టాలకు సైతం కవరేజీ లభిస్తుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వారికే ఇది అవసరం అనుకోవద్దు. ఎత్తయిన అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారికీ హోమ్ ఇన్సూరెన్స్ ఎన్నో రూపాల్లో ఆదుకుంటుంది. ఇంటి విలువ, ఇంట్లోని వస్తువువల విలువ ఆధారంగానే ప్రీమియం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. ప్రయోజనాలు.. హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణానికి వాటిల్లే నష్టానికే పరిహారం అనుకోకండి. గ్యారేజ్, కాంపౌండ్, ఫెన్సింగ్‌కు నష్టం ఎదురైనా కవరేజీ లభిస్తుంది. బేస్ పాలసీలకి యాడాన్‌గా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోని ఆభరణాలు, నగదుకు కూడా రక్షణనిచ్చే కవరేజీలు ఉన్నాయి. లేదంటే సమగ్ర బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఏ రూపంలో దేనికి నష్టం వాటిల్లినా పరిహారం అందుతుంది. ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే, వాటి రీపేర్‌కు అయ్యేంత కాకుండా.. వాస్తవ విలువ మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా బీమా రక్షణ కల్పించుకోవడం ద్వారా భూకంపాలు, వరదల వంటి భారీ నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దొంగలు పడి విలువైన సొత్తు ఎత్తుకుపోయినా, ఈ ప్లాన్‌లో కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందుబాటులోనే ఉంటుంది. రూ.2,000 ప్రీమియంకే కవరేజీనిచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, దోపిడీల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోని వారు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ ఇంటి కారణంగా ఎదురయ్యే న్యాయ వివాదాల్లోనూ రక్షణనిస్తుంది. ఎలా అంటే.. ఇంట్లో పనిచేసే వారు మరణించినా పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అగ్ని ప్రమాదాల వల్ల ఇతర ప్రాపర్టీకి నష్టానికి కారణమైనా, అతిథులు కానీ, ఇతర వ్యక్తుల మరణానికి దారితీసినా కవరేజీ లభిస్తుంది. ఇవి గుర్తుంచుకోండి.. ► హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇంట్లో ఉన్న అన్నింటికీ ఆధారాలు ఉంచుకోవాలి. లేదంటే క్లెయిమ్ సమయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ► అనధికారిక కట్టడం అయితే బీమా కవరేజీ ల భించదు. చట్టబద్ధమైన నిర్మాణాలు, చట్టపరమై న అనుమతులు ఉన్న వాటికే కవరేజీ లభిస్తుంది. ► ఇంట్లో అద్దెకు ఉండే వారు, తమ నివాసంలోని విలువైన అన్ని ఉత్పత్తులకు కవరేజీ తీసుకోవచ్చు. ► వరదల సమయంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉత్పత్తులన్నింటికీ కరెంట్ కరెక్షన్ తొలగించాలి (అన్ ప్లగ్ చేయాలి). ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కూడా తొలగించాలి. ► వరద ముప్పు నుంచి తప్పించుకోవడానికి తమ వంతు ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. నిర్మా ణ సమయంలోనే ఇంటి బేస్మెంట్ను రోడ్డు నుంచి వీలైన మేర ఎత్తున నిర్మించుకోవాలి. ► సీవరేజీ పైపులకు చెక్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలి. వరదల సమయంలో బయటి నీరు సీవరేజీ పైపుల నుంచి మీ ఇంటిని ముంచెత్తకుండా చెక్‌వాల్వ్‌లు సాయపడతాయి. ► వరద నీరు ఇంట్లోకి చేరుతుందని గుర్తించిన వెంటనే విలువైన వస్తువులను ఎత్తయిన ప్రదేశానికి చేర్చాలి. లేదంటే దిగువ అంతస్తుల్లోని వారు ఎగువ అంతుస్తులోని వారి సాయం కోరి పై అంతస్తులకు తరలించాలి. ► ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్లను, నగలను ముందుగా తీసేసి జాగ్రత్త పరుచుకోవాలి. ► కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణం చేసుకున్న వారు మేడపైకి వాటిని తరలించొచ్చు. వరద నీరు మరింత పైకి చేరుతుందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి. ► వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అమలు చేసే విధంగా ముందస్తు కార్యాచరణ దగ్గర ఉంచుకోవాలి. -
ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!
అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి. ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్ కవరేజీ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు. కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. టీపీఏ, నెట్వర్క్ ఆసుపత్రులు బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆమోదించే నెట్వర్క్ హాస్పిటల్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు. అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఊహించని అవరోధాలు.. ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్ ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. -
క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే.. కుదరదు
కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం... బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్వర్క్ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి. నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్వర్క్ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ పొందడం ఒక్కటే మార్గం. ఇతర ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది. ఆస్పత్రిపై ఫిర్యాదు నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దాఖలు ఎలా..? ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించొచ్చు. -
రాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వాహన ప్రమాద బీమా విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజాగ్రత్తగా రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని స్పష్టం చేసింది. దిలీప్ భౌమిక్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసును జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేసు వివరాలు.. తన రాష్ డ్రైవింగ్ కారణంగా త్రిపురకు చెందిన దిలీప్ భౌమిక్ 2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. దిలీప్ మృతికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. విచారించిన త్రిపుర హైకోర్టు మృతుని కుటుంబ సభ్యులకు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా కంపెనీ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదనలు వినిపించింది. సొంత తప్పిదం వల్లే కారు ప్రమాదానికి గురై దిలీప్ మరణించాడని పేర్కొంది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం దిలీప్ థర్డ్ పార్టీ కిందకి రాడని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన దిలీప్ భౌమిక్ మృతికి బీమా కంపెనీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కానీ, వ్యక్తిగత ప్రమాద బీమా పరిహారంగా మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు (వడ్డీ అదనం) చెల్లించాలని తెలిపింది. అయితే, రాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి గురైన ఇతరులకు (థర్డ్ పార్టీ) నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపించబోదని సుప్రీం వెల్లడించింది. -
ఇవి లేకుంటే వాహన విక్రయాలు బంద్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమొబైల్ కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి బైక్‌లు, కార్లకు వరుసగా రెండేళ్లు, ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా లేకుండా వాహన విక్రయాలు జరపరాదని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. తొలిసారి బైక్, కార్లు కొనుగోలు చేసే సమయంలో థర్డ్ పార్టీ బీమాను కల్పిస్తారని, అయితే తదుపరి సంవత్సరం నుంచి వినియోగదారులు దాన్ని కొనసాగించడం లేదని అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ కోర్టుకు నివేదించారు. దేశంలో 66 శాతం వాహనాలకు థర్డ్ పార్టీ బీమా లేదని తెలిపారు. ఒకేసారి 20 ఏళ్లకు సరిపడా మొత్తంతో థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం సాధ్యం కాదని బీమా కంపెనీలు వాదించాయి. అయితే కారు బీమాకు మూడేళ్ల వ్యవధి, బైక్‌లకు ఐదేళ్ల వ్యవధితో థర్డ్ పార్టీ బీమా విధిగా వర్తింపచేయాలని కమిటీ సూచనలతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు వాహనాలకు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావడంతో థర్డ్ పార్టీ బీమాను తీసుకునేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. -
లారీలు కదిలాయి..
- సింగిల్ పర్మిట్‌పై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన అవగాహన... సమ్మె విరమణ - 9 రోజుల తర్వాత రోడ్డెక్కిన లారీలు సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజులుగా కొన సాగిన లారీల సమ్మె శుక్రవారం ముగిసింది. సింగిల్ పర్మిట్లపైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో కుదిరిన అవగాహన మేరకు సమ్మె విరమించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో లారీలు రోడ్డెక్కాయి. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించుకోవాలని, తెలుగు రాష్ట్రాల్లో అనుమతించేలా సింగిల్ పర్మిట్‌ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో గత నెల 30న లారీల యజమానుల సంఘాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. రవాణా మంత్రితో చర్చలు సఫలం... తెలంగాణ ప్రభుత్వంతో శుక్రవారం తాము జరిపిన చర్చల తరహాలోనే మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపనున్నట్లు భాస్కర్‌రెడ్డి చెప్పారు. సింగిల్ పర్మిట్లపైన రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు సరుకు లోడింగ్, అన్లోడింగ్ సర్వీసు చార్జీలు లారీ యజమానులపైన కాకుండా వినియోగదారులే భరించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించింది. లారీల పార్కింగ్‌కు పెద్దఅంబర్‌పేట్, మూసాపేట్‌లలో 10 ఎకరాల చొప్పున స్థలం కేటాయించేందుకు సానుకూలంగా స్పందించింది. లారీ పర్మిట్ల పునరుద్ధరణ, ఫిట్నెస్ పరీక్షలు వంటి ఆర్టీఏ కార్యకలాపాల కోసం స్లాట్‌తో నిమిత్తం లేకుండా సేవలందజేసేందుకు రవాణాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చల్లో తెలంగాణ లారీ యజమానుల సంఘంతో పాటు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, ఇతర లారీ సంఘాలు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, జేటీసీలు వెంకటేశ్వర్లు, రఘునాథ్ పాల్గొన్నారు. ఐఆర్‌డీఏతో నేడు మరో దఫా చర్చలు మరోవైపు థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం తగ్గింపు పైన కేంద్ర బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయన్‌తో శుక్రవారం లారీ సంఘాలు జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. 40 శాతం వరకు పెంచిన ప్రీమియంను మొత్తంగా ఉపసంహరి ంచాలని లారీ సంఘాలు పట్టుబట్టగా... ప్రీమియం తగ్గింపునకు అధికారులు అంగీకరించారు. అయితే 20 శాతానికి తగ్గించాలని లారీ సంఘాలు కోరాయి. ఇందుకు ఐఆర్డీఏ నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. శనివారం మరోసారి చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.