బెంగళూరు: వివిధ దేశాల్లోని భారత రాయబారులు దేశ అభివృద్ధితో పాటు కర్ణాటక అభివృద్ధికి సైతం సహకారాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. నెదర్‌ల్యాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, ఐర్‌ల్యాండ్, కొరియా, మొజాంబిక్ దేశాల్లో భారత రాయబారులతో సీఎం సిద్ధరామయ్య గురువారమిక్కడి క్యాంపు కార్యాలయం కృష్ణాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రపంచ దేశాలకు భారత్‌ను పరిచయం చేయడంతో పాటు ఇక్కడున్న అవకాశాల గురించి తెలియజెప్పాలని కోరారు.
అదే సందర్భంలో కర్ణాటకలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సైతం తెలియజేసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుతం కర్ణాటక దేశంలోనే మూడో స్థానంలో ఉందని వారికి వివరించారు. రానున్న పదేళ్లలో రాష్ట్రంలో రెండు ప్రముఖ పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లాలో దేశంలోనే అతిపెద్దదైన ఉత్పదనా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు భారత రాయబారులకు సీఎం సిద్ధరామయ్య వివరించారు.