
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని కితాబిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలో ప్రారంభమైన శ్రీ కచ్చి లేమా పటేల్ సమాజ్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
కెన్యా స్వాతంత్య్ర పోరాటంలో కచ్చి లేమా నాయకులు కీలక పాత్ర పోషించిన సంగతిని గుర్తుచేశారు. 2001లో భూకంపానికి గురైన గుజరాత్‌లోని కచ్ ప్రాంత పునర్నిర్మాణానికి ఆ సంస్థ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఒకప్పుడు ఎడారిని తలపించిన కచ్‌ను దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ భారత్‌లో పర్యటించని కచ్చి లేమా సభ్యులు అలహాబాద్ కుంభమేళాకు వచ్చి భారత సాంస్కృతిక, వారసత్వ గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment