నేడు బళ్లారి జిల్లాకు సీఎం సిద్ధరామయ్య రాక
► కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు
► బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు
సాక్షి, బళ్లారి : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి జిల్లాకు రానున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి, స్వయంగా కరువు ప్రాంతాలను పర్యటించేందుకు సీఎం సోమవారం బళ్లారి జిల్లాకు రానున్న నేపథ్యంలో బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించి, రైతులతో సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీంతో బళ్లారి జిల్లా అధికారులు సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బళ్లారి నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సీఎం ఉంటున్న సందర్భంగా ఆయా గ్రామాలతో బళ్లారి నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు.
జిల్లాలో కరువు పరిస్థితులను స్వయంగా తిలకించేందుకు సీఎం విచ్చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రైతులపై ఏమైనా వరాల జల్లు కురిస్తారా?లేదా? ఇలా వచ్చి అలా వెళ్లి పోతారా? అని రైతుల్లో సంశయం నెలకొంది. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వం తూతూమంత్రంగా స్పందించింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరువు నివారణ, రైతులను ఆదుకోవడంలో చొరవ చూపలేదు. అయితే సీఎం జిల్లాకు రానున్న సందర్భంగా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఏ మేరకు తమను ఆదుకుంటారన్నది రైతులు ఎదురు చూస్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు.
నేడు పలు రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపు
బళ్లారి టౌన్ : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి నగరానికి రానున్నందున పలు రోడ్ల ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నగరంలోని కౌలుబజార్ రోడ్డు మొదటి గేటు, సుధా క్రాస్, రేడియో పార్కు, ఎస్పీ సర్కిల్, మోతీ సర్కిల్, ఇందిరా సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుందని, ప్రజలు ఈ విషయం గమనించి సహకరించాలని తెలిపారు.