ఎత్తిన హోళే రసాభాస
రైతు నాయకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని సీఎం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
అర్ధంతరంగా సమావేశం నుంచి నిష్ర్కమించిన వీరప్ప మొయిలీ
పోరాటం ఆగదు : ప్రభుత్వాన్ని హెచ్చరించిన కోడిహళ్లి చంద్రశేఖర్
బెంగళూరు: కోలారు, చిక్కబళాపుర జిల్లాలకు శాశ్వత తాగు, సాగునీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన ఎత్తినహోళే పథకం విషయంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం రసాభసగా ముగిసింది. రైతుసంఘం నాయకులు, రైతులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సమావేశం మధ్యలోనే పార్లమెంటు సభ్యుడు వీరప్పమొయిలీ వెళ్లిపోవడం గమనార్హం. కోలారు, చిక్కబళాపుర తదితర మైదాన ప్రాంత జిల్లాల్లో నీటి కష్టాలను తీర్చాలని కోరుతూ మూడు రోజుల ముందు ఆయా ప్రాంత రైతులు బెంగళూరుకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంత రైతులతో ఆదివారం తాను ప్రత్యేకంగా సమావేశమమై వారి అనుమానాలను తీరుస్తానని శాసనసభలో రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిసిద్ధరామయ్య అధ్యక్షతన ఆయా జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రైతు సంఘం నాయకులు క్యాంపు కార్యాలయం ‘కృష్ణ’లో ఎత్తినహోళే విషయమై చర్చించేందుకు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటగా మాట్లాడుతూ...‘నేను కూడా రైతు బిడ్డను... రైతుల కష్టాలు నాకు తెలుసు. మైదాన ప్రాంత జిల్లాలకు నీటి కష్టాలను తీర్చడానికి ఉద్దేశించిన ఎత్తినహోళే పథకం అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం కోసం కేటాయించిన రూ.32 వేల కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చుబెట్టాం. పనులు పూర్తయితే 24 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది.’ అని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కలుగ జేసుకున్న రైతు సంఘం నాయకులు ఎత్తినహోళే వల్ల కేవలం అందుబాటులోకి వచ్చే 24 టీఎంసీల నీరు మైదానప్రాంత జిల్లాలోని ప్రస్తుతం ఉన్న జనాభాకు తాగునీటికి మాత్రమే సరిపోతుందన్నారు. అయితే ఈ జిల్లాలో అవసరమైన సాగునీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. అందుబాటులోకి వ చ్చే 24 టీఎంసీల నీటిని ఏ జలాశయం నుంచి తీసుకువస్తారో ఇప్పుడే చెప్పాలని పట్టుబట్టారు. అదేవిధంగా ఎత్తిన హోళే పథకంపై అనేక సాంకేతిక పరమైన సమస్యలు ఉండటంతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, నిపుణులు అడిగిన ప్రశ్నలకు సిద్ధరామయ్యతో పాటు అక్కడే ఉన్న సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్, ఇతర ప్రభుత్వ అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తూ రైతు సంఘం నాయకులు నినాదాలు చేశారు.
అక్కడే ఉన్న పార్లమెంటు సభ్యుడు వీరప్పమొయిలీను కూడా విమర్శించడం మొదలు పెట్టారు. దీంతోమొయిలీ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఇదిలా ఉండగా మైదానప్రాంత జిల్లాల్లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం డాక్టర్ పరమశివయ్య నివేదికను తప్పక అమలు చేయాలని సమావేశంలో రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ తమ పోరాటం ఆగదని రైతు సంఘం నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌తోపాటు సమావేశంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.