రూ.10 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి | Rs 10 crore package Announce for Drought | Sakshi
Sakshi News home page

రూ.10 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి

Published Wed, Dec 10 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

Rs 10 crore package Announce for Drought

మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్

నాగపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువుపరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడారు. నాగపూర్ విధాన సభలో బుధవారం సమావేశం మొదలవ్వగానే కాంగ్రెస్ పక్ష డిప్యూటీ నాయకుడు విజయ్ వడ్డేటివార్ మాట్లాడుతూ.. కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని కోరారు. కాగా, సదరు అంశాలపై చర్చకు రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అంగీకరించారు.

స్పీకర్ అనుమతి ఇచ్చిన అనంతరం పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి సోయ, పాడి రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల భార్యలకు వితంతు పింఛను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాడి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. లీటర్ మంచినీళ్లు రూ.20 ఉంటే, లీటర్ పాలు రూ.17 ఉన్నాయని, దీన్ని బట్టే పాడి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

కౌన్సిల్‌లో గందరగోళం..: కాగా, కరువు, రైతు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో విధాన మండలిలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు కొన్నిసార్లు వెల్‌లోకి దూసుకురావడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ గందరగోళంలోనే కౌన్సిల్ నాయకుడిగా ఏక్‌నాథ్ ఖడ్సేను, డిప్యూటీ నాయకుడిగా చంద్రకాంత్ పాటిల్ పేర్లను ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తన మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేశారు. కాగా, శీతాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులైనా ప్రతిపక్ష నేతను ఖ రారుచేయకపోవడంపై షేత్కారీ కాంగార్ పక్ష (ఎస్‌కేపీ)కి చెందిన ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ప్రశ్నించారు.

ప్రతిపక్షనేత లేకుండా సభ నడవడం చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది సరైన సంప్రదాయం కాదని ఆయన ఆరోపించారు. పాటిల్‌కు మద్దతుగా కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నిలిచారు. కాగా, ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపక్ష నేతను చైర్మన్ నిర్ణయిస్తారని డిప్యూటీ చైర్‌పర్సన్ వసంత్‌రావ్ దావ్‌ఖరే ప్రక టించారు. కాగా, ప్రతిపక్ష నేతను ఏ విధానంపై నిర్ణయించనున్నారో తెలపాలని ఎన్సీపీ నేత సునీల్ తత్కారే డిమాండ్ చేశారు.

తమపార్టీ తరఫున ధనంజయ్ ముండే పేరును ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. కాగా, కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మొదట ఎన్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటామని ప్రకటించారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేత సీటు కావాలంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్ష నేత పదవి కోసం బీజేపీ నుంచి ధనంజయ్ ముండే, కాంగ్రెస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రే పేర్లను ప్రతిపాదిస్తూ తనకు లేఖలు అందినట్లు మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.

ఓటమి తర్వాతే రైతులు గుర్తుకొచ్చారా..: అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలకు రైతులు గుర్తుకువస్తున్నారని శివసేన విమర్శించింది. 15 యేళ్లుగా వారే రాష్ట్రాన్ని పాలించారు.. వారి అవినీతి పాలనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించింది. మూడు రోజులుగా వారు అసెంబ్లీ సమావేశాల్లో డ్రామా నడుపుతున్నారని బుధవారం నాటి సామ్నా సంపాదకీయంలో తీవ్రంగా దుయ్యబట్టింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement