విశ్లేషణ
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!
కాంగ్రెస్‌కు పెద్ద సవాలు
ఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్‌డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!
కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.
కూటముల వైఫల్యం వెనుక...
కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్‌లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్‌డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్‌గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.
చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?
కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్‌లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.
- రషీద్ కిద్వాయి
సీనియర్ జర్నలిస్ట్, రచయిత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment