
అహ్మాదాబాద్: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక నినాదంతో వ్యతిరేక కూటమి ద్వారా జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నాయి. అయితే.. తాను ఏంటన్నది స్పష్టత ఇవ్వకుండానే.. బీజేపీని దెబ్బ కొట్టాలని విఫలయత్నాలు చేస్తున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మరి విపక్ష కూటమిపై ఆయన అభిప్రాయం ఏంటి?.. ఆయన ఆ కూటమితో చేతులు కలుపుతారా? లేదా?..
తాజాగా.. అహ్మాదాబాద్‌లో ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చావేదికలో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని ఖుల్లాగా వెల్లడించారు. ‘‘నేను ఎవరికీ వ్యతిరేకంగా కాదు. పార్టీలన్నీ కూటమిగా ఏర్పడడం వల్లనో, నేతలను ఒక్కతాటిపైకి రావడం వల్లనో మన దేశం ఎదగదు. అశేష భారతావనిని ఒక్కతాటిపైకి తెచ్చినప్పుడే నెంబర్ వన్ అవుతాం’’ అని పేర్కొన్నారు.
తనది జాతీయవాదమని మరోసారి స్పష్టం చేసిన కేజ్రీవాల్.. రాజకీయ పార్టీల కూటమిలు ఏర్పడడం.. విడిపోవడం.. గురించి తనకేమీ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. ‘‘అలాంటివి వాళ్ల వల్లే సాధ్యం అవుతాయి. నా వల్ల కాదు. కూటమిలు ఎలా ఏర్పడతాయి? ఎలా పని చేస్తాయి?.. ఈ విషయాల్లో నేను చాలా వెనుకబడ్డా’’ అంటూ పరోక్షంగా తెలంగాణ కేసీఆర్, బీహార్ నితీశ్ కుమార్, బెంగాల్ మమతా బెనర్జీ ప్రయత్నాల గురించి ప్రస్తావించారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో.. బీజేపీ వ్యతిరేక గళం వినిపిస్తూ ఒంటరిగానే ముందుకు వెళ్తానని దాదాపుగా స్పష్టత ఇచ్చారాయన.
ఇక.. ఆప్ అనేది కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి వచ్చిన బీజేపీ బీ టీం అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. ఖుల్లాగా చెప్పాలంటే.. కాంగ్రెస్‌ను బలహీన పర్చాలంటే నేనే అవసరమా? రాహుల్ సరిపోడా? అంటూ సెటైర్లు సంధించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యతిరేక చర్యతో దేశానికి మంచి చేయాలని ఎవరు అనుకున్నా ఫర్వాలేదు. ఆయన ప్రయత్నం ఆయన్ని చేయనివ్వండి. ఆల్ ది బెస్ట్’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం
Comments
Please login to add a commentAdd a comment