ఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ (ఆప్) కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలో బుధవారం పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకుంటామని ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ మాజీ సీఎం స్పందించారు. తాము ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ మూడోసారి సైతం పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆప్ దూరంగా ఉండటానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేశాయి. ఏడు లోక్‌సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. అన్నీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టే, అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు విషయంలో రెండు పార్టీలు పునరాలోచనలో పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇండియా కూటమిలో చీలికలు
మరోవైపు 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అయితే కేజ్రీవాల్ వైఖరితో ఇండియా కూటమిలో చీలిక దిశగా పయనిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆప్‌తో పొత్తు ‘పొరపాటే’
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ సైతం ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే పొరపాటే అవుతుందన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నొక్కి చెప్పారు.‘లోక్‌సభ ఫలితాల తర్వాత ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో
ఈ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2015 ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది. 2020లో ఆప్ 62 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుని ఎనిమిది స్థానాలను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment