సాయం కావాలి | Need help | Sakshi
Sakshi News home page

సాయం కావాలి

Published Fri, Apr 3 2015 1:21 AM | Last Updated on Fri, May 25 2018 1:22 PM

సాయం కావాలి - Sakshi

సాయం కావాలి

కేంద్ర బృందానికి  కరువు పరిస్థితులను చెప్పిన జిల్లా అధికారులు
జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం   కరువు నివేదిక సమర్పించిన జిల్లా కలెక్టర్

 
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కరువు పరిస్థితులను గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. తొలుత రామానంద్, వదనాసింఘాల్, శ్రీవాత్సవతో కూడిన బృందం  స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన కరువుపై ఫొటోప్రదర్శనను తిలకించింది. కలెక్టర్‌తోపాటు  వ్యవసాయ, హార్టికల్చర్, సిరికల్చర్, పశుసంవర్థక, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలోని కరువు పరిస్థితులను వివరించారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటాయని చెప్పారు. సాధారణ సాగులో సగం కూడా పంటలు సాగు కాలేదని వివరించారు. అరకొరగా వేసిన పంటలు నిలువునా ఎండిపోయాయన్నారు. సాగునీరుతోపాటు తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. పశువులకు తాగునీటితోపాటు గ్రాసం అందే పరిస్థితి లేదన్నారు.  2వేల గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

పనులు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో సాయం అందేలా చూడాలని వారు  కేంద్ర బృందాన్ని కోరారు. అనంతరం కరువు బృందం జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, మదనపల్లె,   తంబళ్లపల్లె, పీలేరు  ప్రాంతాల్లో పర్యటించి అడుగంటిన భూగర్భ జలాలు, ఒట్టిపోయిన బోరుబావులు, ఎండిపోయిన పంటలు, తాగునీటి ఇబ్బందులు పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి కరువు పరిస్థితులను తెలుసుకున్నారు. కరువు పరిస్థితిపై కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నివేదిక సమర్పించారు.
 
కరువు నివేదిక  ఇదే :

 తీవ్రవర్షాభావం: జిల్లాలో సాధారణ వర్షపాతం 933.9 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 640.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2014-15కు గాను జిల్లాలో 42 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.
 తగ్గిన పంటల సాగు: గత ఖరీఫ్‌లో జిల్లాలో 2,15,358 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సిఉండ గా, కరువు పుణ్యమా అని 1,91,629 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. ఈ లెక్కన 23,729 హెక్టార్లు సాగుకు నోచుకోలేదు. రబీ సీజన్‌లో 50 శాతం విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు.

 తాగునీటి కష్టాలు: జిల్లాలో 18,776 చేతిపంపులు ఉండగా, 3,179 సీజనల్‌గా మారాయి. 8,441 పీడబ్ల్యూఎస్ పథకాలుండగా, 1483 సీజనల్‌గా మా రాయి.  తీవ్ర వర్షాభావం నేపథ్యంలో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. 90శాతం తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి.  ఇప్పటికే 2,061 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 318 గ్రామాలకు టైఅప్ బోర్ల ద్వారా  ప్రభుత్వమే నీటిని సరఫరా చేస్తోంది. రాబోయే కాలంలో మరో 500 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి రావొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క నీటి సరఫరాకే నెలకు రూ.4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక జిల్లాలోని దాదాపు 9లక్షల పశువులకు సైతం తాగునీటి సరఫరా చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

అటుగంటిన భూగర్భజలాలు: జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. రోజురోజుకూ మరింతగా తగ్గిపోతున్నాయి.  కుప్పం, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల్లో పడమటి మండలాల్లో 1500 అడుగుల లోతుకు బోరుబావులు తవ్వినా నీళ్లుపడే పరిస్థితి లేదు.

 పెరిగిన వలసలు: వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోంది. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళుతున్నారు. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో వలసలు పెరిగాయి.

కేంద్ర సాయం అందించాలని కోరాం: సిద్ధార్థ్‌జైన్, కలెక్టర్

కరువు తీవ్రత నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రసాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విలేకరులకు వివరించారు. గురువారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. ఖరీఫ్‌తో పాటు రబీలోనూ పంటల సాగు పూర్తిగా తగ్గిందని, 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని కరువు బృందానికి తెలిపినట్లు చెప్పారు. ఇప్పటికే 2వేల గ్రామాలకు తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందనే విషయాన్ని కరువు బృందానికి వివరించినట్లు తెలిపారు. నీటి సరఫరాకు సంబంధించిన ఓచర్స్ సైతం కరువు బృందానికి చూపామన్నారు. వర్షాభావంతో 50వేల ఎకరాల్లో పంటల సాగు తగ్గిన విషయాన్ని చెప్పామన్నారు. వేరుశెనగ పంట 50 శాతం దిగుబడి కూడా రాలేదన్నారు.  జిల్లాలో పశువులకు సైతం తాగునీటితోపాటు గ్రాసం, దాణా అందిస్తున్నామన్నారు.  కేంద్ర సాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement