కరువు జిల్లాగా ప్రకటించాలి
► తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ డిమాండ్
కరీంనగర్ కల్చరల్ : వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయూరని, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేద్రంలోని కెమిస్ట్ భవన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లాస్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... జిల్లాలోని 57 మండలాలకు గాను 40 మండలాల్లో కరువున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ 19 కరువు మండలాలనే ప్రకటించడం శోచనీయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుతామన్నారు.
ఇప్పటికైనా కరువుపై ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేష్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు హామీలుగానే మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందన్నారు. రైతులు కరువు బారినపడి కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ విధానాలకు నిరసనగాఉద్యమాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెగ్గెం రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి వరాల శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలోని కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం సిగ్గుచేటాన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ముస్కు వెంకట్‌రెడ్డి, సందమల్ల నరేష్, ఎస్‌కే.జావీద్, సిరి రవి, పిండి ఎల్లారెడ్డి, వేణుమాధవరావు, బోగె పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.