తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం
► అడ్డుకున్న లచ్చన్నపాలెం గ్రామస్తులు
► పోలీసుల సాయంతో కొనసాగుతున్న పనులు
లచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఎట్టకేలకు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను స్థానికులు మళ్లీ అడ్డుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నారు. మండలంలోని లచ్చన్నపాలెం సర్పానదిలో రూ.ఏడు కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని భావించిన గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తున్నారు.
మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో మళ్లీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఈ పనులను అడ్డుకుంటే కేసులు తప్పవని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించడంతో చేసేదిలేక వారు అడ్డుతొలగారు.
దీంతో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నదిలో ట్యాంకు నిర్మాణానికి తీసిన ప్రాంతంలో ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు.
కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు
తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటితోపాటు పాడిపరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లచ్చన్నపాలెం గ్రామస్తులు అనేక సార్లు పనులు అడ్డుగించారు. ఇక్కడ ప్రాజెక్టు వద్దని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది.