ఇక తాగునీటికీ కటకట
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అధికారిక కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇప్పుడిక నీటి కోతలకు కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తనుంది. బెంగళూరు నగర వాసులకు ప్రధాన తాగునీటి వనరు అయిన క్రిష్ణరాజ సాగర్(కేఆర్‌ఎస్) డ్యామ్‌లో నీటి లభ్యత అడుగంటడంతో నగరంలో నీటి కోతలకు సన్నద్ధం కావాలని బెంగళూరు వాటర్‌సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులు నిర్ణయించా రు. ప్రస్తుతం బెంగళూరులో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని వదులుతుండగా, నీటి లభ్యతను అనుసరించి మూడు రోజులకు ఓసారి లేదా వారానికి ఓసారి మాత్రమే తాగునీటిని అందజేయాలని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే అధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇక తాగు నీటికి కూడా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.
కేఆర్‌ఎస్‌లో అడుగంటిన నీటిమట్టం : బెంగళూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరు కృష్ణరాజ సాగర జలాశయం మాత్రమే. ఈ జలాశయం నీటితోనే నగర వాసుల దాహార్తి తీరుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేఆర్‌ఎస్ జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం (సెప్టెంబర్ 4నాటికి) 25టీఎంసీలు మాత్రమే.(కేఆర్‌ఎస్ సామర్థ్యం 50టీఎంసీలు). ఈ జలాశయం నుంచి బెంగళూరు, మైసూరు, మండ్యా తదితర ప్రాంతాలకు తాగు, సాగు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో మొదట తాగు నీటికి మాత్రమే నీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
బెంగళూరుకు తాగునీటి అవసరాల కోసం వచ్చే ఏడాది జూన్ వరకూ సాధారణంగా 20 టీఎంసీలు అవసరం, అయితే ఒక్క బెంగళూరుకే 20 టీఎంసీల నీటిని ఇస్తే మిగిలిన ప్రాంతాలకు కనీసం తాగునీటినైనా అందించగలరా అనేదే ఇక్కడ ప్రధాన సమస్య. ఈ నేపథ్యంలో 20టీఎంసీల నీటిని కేవలం బెంగళూరు వాసుల తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసి ఉంచాల్సిందిగా బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు ఇప్పటికే కావేరి నీరావరి నిగమ్ లిమిటెడ్ అధికారులకు లేఖలు రాశారు. అయితే ఈ విషయంపై వారి నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లభించని నేపథ్యంలో బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు నగరంలో నీటి కోతల దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.
మూడు రోజులకో లేదా వారానికో.....
ఇక ప్రస్తుతం బెంగళూరు నగరంలో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కేఆర్‌ఎస్‌లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో మూడు రోజులకో లేదంటే వారానికి ఒకసారో తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నట్లు బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చీఫ్ ఇంజనీర్ ఎస్.క్రిష్ణప్ప తెలిపారు. ‘కేఆర్‌ఎస్‌లో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో కొన్ని మోటార్లను నిలిపేసి నగరంలో నీటి కోతలను విధించాలని భావిస్తున్నాం. ఒకవారం రోజుల్లో కనుక సమృద్ధిగా వర్షాలు కురవకపోతే సెప్టెంబర్ మూడో వారం నుంచే ఈ కోతలు అమల్లోకి వస్తాయి. ఇక ఇదే సందర్భంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై కూడా బెంగళూరు వాసుల్లో చైతన్యం కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం’ అని ఎస్.క్రిష్ణప్ప వెల్లడించారు.