water cuts
-
ఇక తాగునీటికీ కటకట
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అధికారిక కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇప్పుడిక నీటి కోతలకు కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తనుంది. బెంగళూరు నగర వాసులకు ప్రధాన తాగునీటి వనరు అయిన క్రిష్ణరాజ సాగర్(కేఆర్ఎస్) డ్యామ్‌లో నీటి లభ్యత అడుగంటడంతో నగరంలో నీటి కోతలకు సన్నద్ధం కావాలని బెంగళూరు వాటర్సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(బీడబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులు నిర్ణయించా రు. ప్రస్తుతం బెంగళూరులో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని వదులుతుండగా, నీటి లభ్యతను అనుసరించి మూడు రోజులకు ఓసారి లేదా వారానికి ఓసారి మాత్రమే తాగునీటిని అందజేయాలని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే అధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల కరెంటు కోతలను ఎదుర్కొంటున్న బెంగళూరువాసులు ఇక తాగు నీటికి కూడా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కేఆర్‌ఎస్‌లో అడుగంటిన నీటిమట్టం : బెంగళూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరు కృష్ణరాజ సాగర జలాశయం మాత్రమే. ఈ జలాశయం నీటితోనే నగర వాసుల దాహార్తి తీరుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేఆర్ఎస్ జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం (సెప్టెంబర్ 4నాటికి) 25టీఎంసీలు మాత్రమే.(కేఆర్ఎస్ సామర్థ్యం 50టీఎంసీలు). ఈ జలాశయం నుంచి బెంగళూరు, మైసూరు, మండ్యా తదితర ప్రాంతాలకు తాగు, సాగు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో మొదట తాగు నీటికి మాత్రమే నీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరుకు తాగునీటి అవసరాల కోసం వచ్చే ఏడాది జూన్ వరకూ సాధారణంగా 20 టీఎంసీలు అవసరం, అయితే ఒక్క బెంగళూరుకే 20 టీఎంసీల నీటిని ఇస్తే మిగిలిన ప్రాంతాలకు కనీసం తాగునీటినైనా అందించగలరా అనేదే ఇక్కడ ప్రధాన సమస్య. ఈ నేపథ్యంలో 20టీఎంసీల నీటిని కేవలం బెంగళూరు వాసుల తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసి ఉంచాల్సిందిగా బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు ఇప్పటికే కావేరి నీరావరి నిగమ్ లిమిటెడ్ అధికారులకు లేఖలు రాశారు. అయితే ఈ విషయంపై వారి నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లభించని నేపథ్యంలో బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు నగరంలో నీటి కోతల దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మూడు రోజులకో లేదా వారానికో..... ఇక ప్రస్తుతం బెంగళూరు నగరంలో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కేఆర్‌ఎస్‌లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో మూడు రోజులకో లేదంటే వారానికి ఒకసారో తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నట్లు బీడబ్ల్యూఎస్ఎస్బీ చీఫ్ ఇంజనీర్ ఎస్.క్రిష్ణప్ప తెలిపారు. ‘కేఆర్‌ఎస్‌లో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో కొన్ని మోటార్లను నిలిపేసి నగరంలో నీటి కోతలను విధించాలని భావిస్తున్నాం. ఒకవారం రోజుల్లో కనుక సమృద్ధిగా వర్షాలు కురవకపోతే సెప్టెంబర్ మూడో వారం నుంచే ఈ కోతలు అమల్లోకి వస్తాయి. ఇక ఇదే సందర్భంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై కూడా బెంగళూరు వాసుల్లో చైతన్యం కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం’ అని ఎస్.క్రిష్ణప్ప వెల్లడించారు. -
నీటి కోతలు ఎత్తేస్తాం!
సాక్షి, ముంబై : నగర వాసులకు ఓ శుభవార్త! నగర ప్రజలు కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న నీటి కోతలు త్వరలోనే ఎత్తివేయనున్నారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది. కాగా, నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా పెరగడంతో బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేషన్ డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ తవాడియా కోతలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోని నీటిమట్టం పెరిగిందని తెలిపారు. జూన్, జూలైలో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగైంద న్నారు. ప్రస్తుతం నీటి నిలువలు నగరవాసులకు సరిపడినంతగా ఉన్నాయని , దీంతో నీటికోతను ఎత్తివేయాలని నిశ్చయించుకున్నామని ఆయన పేర్కొన్నారు.అక్టోబర్ ఒకటో తేదీ వరకు వర్షాలు అనుకున్న స్థాయిలో కురిసి జలాశయాలు నిండితే వచ్చే వర్షాకాలం వరకు నగర వాసులకు సరిపడినంత నీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు చాలా తక్కువ స్థాయిలో కురవడంతో కార్పొరేషన్ జూలై 1వ తేదీ నుంచి 20 శాతం నీటి కోతలు విధించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఇదే నెల చివరిలో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో 10 శాతం నీటి కోతను తగ్గించామన్నారు. కాగా వాణిజ్య, పారిశ్రామిక భవనాల్లో మాత్రం 50 శాతం నీటి కోతను కొనసాగించామని తవాడియా పేర్కొన్నారు. ఇదిలా వుండగా, నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో ప్రస్తుతం 12.41 లక్షల మిలియన్ లీటర్ల నీరు అందుబాటులో ఉందన్నారు. కాగా, వచ్చే వర్షాకాలం వరకు నగరానికి రోజు నీటిని సరఫరా చేయడానికి 14.47 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం 288 రోజులకు సరిపడినంత నీరు ఉన్న మోదక్ సాగర్, మిడిల్, అప్పర్ వైతర్ణ జలాశయాల్లో నీరు గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం నగరానికి భాత్స జలాశయం నుంచి ఎక్కువ మోతాదులో నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో కూడా 227 రోజులకు సరిపడా నీరు ఉందని తివారి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో నీటిమట్టం ఓవర్ ఫ్లో మార్కు కన్నా కేవలం ఆరు మీటర్లు తక్కువగా ఉందన్నారు. కాగా మిడిల్ వైతర్ణలో కూడా ఓవర్ ఫ్లో మట్టానికి మూడు మీటర్లు తక్కువగా నీటిమట్టం నమోదైందని తెలిపారు. -
జల గండం..!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలో తిరిగి నీటికోతలు మొదలయ్యాయి. వేసవి కాలంలో నగరంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా ఉండేది. కాగా, ఇటీవల భారీగా వర్షాలు పడటంతో జలాశయాలకు నీరు చేరడంతో కార్పొరేషన్‌కు నీటికోతలు ఎత్తివేశారు. అయితే రెండు రోజులుగా వర్షం ముఖం చాటేయడంతో ముందుజాగ్రత్త చర్యలు తిరిగి నీటి కోతలు మొదలుపెట్టారు. దీంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఖడక్ వాస్లా జలాశయంలో ప్రస్తుతం కేవలం 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొన్ని రోజులుగా భారీవర్షాలు నమోదు కావడంతో నగరవాసులకు తాత్కాలికంగా నీటికోతలు ఎత్తివేసి ప్రతిరోజూ నీటిని సరఫరా చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. కాగా, వానలు తిరిగి తగ్గుముఖం పట్టడంతో జలాశయంలో నీటినిల్వలో పెరుగుదల పడిపోయింది. గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్లు.. ఇప్పుడు ఖడక్ వాస్లా జలాశయంలో అందుబాటులో ఉన్న నీటిని కార్పొరేషన్‌తోపాటు దౌండ్, ఇందాపూర్ మున్సిపాలిటీలతో పాటు మరో 13 గ్రామాలకు కూడా సరఫరా చేయాలని సీఎం ృపథ్వీరాజ్ చవాన్ ఆజ్ఞాపించిన సంగతి తెలిసిందే. దీంతో కార్పొరేషన్ అధికారులు తలపట్టుకున్నారు. దీంతో నగరానికి మళ్లీ రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులకు ప్రతిరోజూ 1150 ఎల్‌ఎండీల నీరు అవసరమవుతోంది. అంటే ప్రతి నెలా 1.2 టీఎంసీలు నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు జలాశయంలో ఉన్న నీటి నిల్వలు నగరానికి మాత్రమే సరఫరా చేస్తే 7 నెలల వరకు ఇబ్బంది ఉండదు. అయితే ఇదే జలాశయం నుంచి 1.5 టీఎంసీల నీటిని మరో రెండు మున్సిపాలిటీలకు, 13 గ్రామాలకు కూడా సరఫరా చేయాల్సి రావడంతో నిల్వలు కేవలం ఐదున్నర నెలలు మాత్రమే సరిపోతాయని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు ఎదురవ్వబోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రోజు విడిచి రోజు నీటిని విడుదల చేసేందుకు యోచిస్తున్నారు. అయితే అధికారుల తీరుపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరం నీటిసమస్యతో ఇబ్బందిపడుతుంటే జలాశయం నుంచి వేరే మున్సిపాలిటీలకు, గ్రామాలకు నీటిని సరఫరా చేయమని సీఎం చెప్పడం రాజకీయలబ్ధి కోసమేనని వారు ఆరోపిస్తున్నారు. -
ఒక ఆత్మీయ అతిథి
తపాలా: మే నెలాఖరు రోజులు. రోహిణికార్తె ప్రభావంతో ఎండలు మండి పోతున్నాయి. దానికితోడు కరెంట్‌కోత, నీటి కొరత. ఇలాంటి పరిస్థితులలో మా ఇంటికి అతిథి రాబోతున్నారంటే నాకు కొంచెం కంగారుగానే ఉంది. అందులోనూ వచ్చేవారు నాకైతే పరిచయం లేరు. మావారికి కాలేజీ రోజుల్లో క్లాస్మేట్. చాలా సంవత్సరాల తరువాత స్నేహితుల ద్వారా అడ్రస్ తెలుసుకొని రాబోతున్నారు. ఎలా ఉంటారో, ఏమో! సాధారణంగా మావారి కొలీగ్స్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ల వ్యక్తిగత పనుల మీదగానీ, ఆఫీస్ పనుల మీదగానీ మా ఊరు వచ్చినప్పుడు తప్పకుండా తనని కలిసే వెళతారు. భార్యా, పిల్లలతో వచ్చినప్పుడు కూడా వాళ్ల బిజీ షెడ్యూల్లోనూ ఏదో ఒక పూట వీలు చూసుకొని మాయింటికి రావడం, భోంచేసి వెళ్లడం మామూలే. కొత్తవారైతే ఆకాస్త సమయంలోనే పరిచయం చేసుకొని, నాలుగు కబుర్లు చెప్పుకొని భోంచేయడం... ఆ తరువాత వీడ్కోలు! మరలా వారి కుటుంబాన్ని కలుసుకోవడం ఎప్పటికో గానీ కుదరదు. ‘‘ఇప్పుడు మనింటికి వచ్చే అతిథి కూడా ఇంతే’’ అని అనుకున్నాం, నేనూ మా అమ్మాయీ. ప్రక్క ఊరిలో పనుండి వచ్చిన స్నేహితుడిని ముందురోజు అక్కడికి వెళ్లి రిసీవ్ చేసుకొని, వచ్చిన పని పూర్తి చేసుకొని, ఈరోజు మధ్యాహ్నం భోజనం వేళకు వచ్చేస్తాం అని చెప్పారు మావారు. రెండింటికి వస్తామన్నవాళ్లు నాలుగవుతుండగా వచ్చారు. రాగానే తన స్నేహితుడిని నాకూ, మా అమ్మాయికీ పరిచయం చేసారు మావారు. వాళ్లిద్దరూ ఇంజినీరింగ్ క్లాస్మేట్స్. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆయన మర్యాదపూర్వకంగా నమస్కరించి గంభీరంగా ఉండిపోలేదు. భోజనం చేస్తున్నంత సేపూ మావారితోనే కాకుండా నాతో, మా అమ్మాయితో మాట్లాడుతూ, తన ఫ్యామిలీ వివరాలు కూడా చెప్తూ, వండిన పదార్థాలను మెచ్చుకుంటూ... కొద్ది సమయంలోనే తన ప్రవర్తనతో మాకు ఎప్పటినుంచో పరిచయమున్న ఆత్మీయుడిలా అనిపించారు. మా అమ్మాయి సాధారణంగా ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అలాంటిది తనుకూడా మాతో కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ ఉంటే నాకు అతిథిపై మరికొంచెం గౌరవం పెరిగింది. ఆయన్ని చూస్తే పరిచయంలేని వ్యక్తిలా కనిపించలేదు. వేల మైళ్ల దూరంలో ఉంటూ మూడేళ్లకోసారి అందరినీ కలుసుకోవాలని, ఆత్మీయంగా మెలగాలని, ఎంతో ఆప్యాయంగా వచ్చే మా అన్నయ్యే గుర్తొచ్చారు. సాయంత్రం అదే ఊరిలో ఉంటున్న తన డీఐజీ బాల్య స్నేహితుడి ఇంటికి వెళుతూ మమ్మల్నీ తనతో రమ్మని ఆహ్వానించారు మా అతిథి. ‘మీ స్నేహితుడి ఇంటికి మేమెందుకు? మీరు మీ స్నేహితునితో వెళ్లండి’ అన్నాను నేను. ‘ఒకే ఊరిలో ఉంటున్నారు. ఆ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. వారూ మీలాగే నాకు ఆప్తులు’ అని చెప్పగానే మరేం మాట్లాడకుండా బయలుదేరాం. మా అమ్మాయి కూడా ఒప్పుకోవడం నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. మా అతిథితో తన స్నేహితుడి ఇంటికి మేము అతిథులుగా వెళ్లడం... అక్కడ వారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి, వారి స్నేహపూర్వక ప్రవర్తన... వారితో మేము గడిపిన కొద్ది సమయం ఎంత సరదాగా గడిచిపోయిందో యిదంతా మాటలతో వ్యక్తపరచలేని అనుభూతిని ఇచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దగ్గరలోని గుడికి వెళ్లాం. భగవంతుని సన్నిధిలో మా కుటుంబంపైన తన అభిప్రాయాన్ని తెలపడం... వీడ్కోలు సమయంలో తన స్నేహితుడికి అపురూప కానుక నివ్వడం... మాతో ఫొటోలు తీసుకొని పదిల పరుచుకోవడం... ఇలాంటివెన్నో మా అతిథి మాకందించారు. మండు వేసవిలోనే తియ్యతియ్యని మామిడిపండ్లు, చల్లచల్లని ముంజలు దొరికినట్లే ఈ వేసవిలో మా ఇంటికి వచ్చి, స్నేహమనే దారంతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూర్చి, తన ప్రవర్తనా పరిమళాన్ని దానికి చేర్చి, తోరణంగా మా గుమ్మానికి కట్టి వెళ్లిన మా ఆత్మీయ అతిథీ... మీరు మళ్లీ మా ఇంటికి ఎప్పుడు వస్తారు? - పైడి వాసవి, గుంటూరు -
నీటి వెతలు షరామామూలే
- రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు - నీటికోతలు తగ్గించలేమంటున్న అధికారులు -వారం, పదిరోజులు భారీవర్షాలు పడితే తప్ప పరిస్థితి మారదని స్పష్టీకరణ సాక్షి, ముంబై: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరంలో అమలవుతున్న నీటికోతపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనిపించడంలేదు. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలవల్ల నగరానికి నీటి సరఫరాచేసే కొన్ని జలాశయాల్లో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ఇది ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ఈ వర్షంవల్ల నగర ప్రజలకు ఒరిగేదిమి లేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్పష్టం చేసింది. మరో వారం, పది రోజులు తె రిపిలేకుండా భారీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి గాడిన పడే సూచనలు లేవని బీఎంసీ నీటిసరఫరా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ వానలు పత్తాలేకుండా పోయాయి. మరోపక్క జలాశయాలు అడుగంటసాగాయి. దీంతో గత్యంతరం లేక నగర ప్రజలకు నీటి కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఎప్పటి నుంచి, ఎంతమేర విధించాలనే దానిపై కొద్దిరోజులుగా తర్జనభర్జన పడసాగారు. ఎట్టకేలకు బుధవారం నుంచి 20 శాతం నీటి కోత అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందే అనధికారికంగా ఐదు శాతం నీటి కోత విధిస్తున్నారు. దీంతో మొత్తం 25 శాతం నీటి కోత అమలులో ఉంది. కాని బుధవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ గురువారం భారీ వర్షమేమీ పడలేదు. నగర, శివారు ప్రాంత పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. కాని జలాశయాల పరిసరా ప్రాంతాల్లో స్వల్పంగా పడింది. జలాశయాల్లో తగినంత నీటి మట్టం పెరిగేంత వరకు కోత తప్పదని అంటున్నారు. 2013 జూలై మూడో తేదీన 4,51,793 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండగా, ఈ ఏడాది జూలై మూడో తేదీన 1,09,241 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీన్ని బట్టి జలాశయాల్లో ఈ ఏడాది నీటిమట్టం ఏ స్థాయికి పడిపోయిందో తెలుస్తోంది. నగరానికి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల పరిసరాల్లో గురువారం సాయంత్రం వరకు తులసీ డ్యాంవద్ద అధికంగా 191 మి.మీ. వర్షం కురిసింది. విహార్ పరిసరాల్లో 176, భాత్సా-16, మోడక్‌సాగర్-4.60, తాన్సా-4, అప్పర్ వైతర్ణ-0.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. కాని ఎక్కడా భారీవర్షం నమోదు కాలేదు. రెండు రోజులుగా వాతావరణం కొంత చల్లబడడంతో ప్రజలు ఊపిరీపీల్చుకున్నారు. కాని శుక్రవారం పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఉక్కపోత ప్రజలను తిరిగి విసిగించింది.