సాక్షి, ముంబై : నగర వాసులకు ఓ శుభవార్త! నగర ప్రజలు కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న నీటి కోతలు త్వరలోనే ఎత్తివేయనున్నారు. ఈ మేరకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది. కాగా, నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా పెరగడంతో బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేషన్ డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ తవాడియా కోతలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోని నీటిమట్టం పెరిగిందని తెలిపారు. జూన్, జూలైలో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగైంద న్నారు. ప్రస్తుతం నీటి నిలువలు నగరవాసులకు సరిపడినంతగా ఉన్నాయని , దీంతో నీటికోతను ఎత్తివేయాలని నిశ్చయించుకున్నామని ఆయన పేర్కొన్నారు.అక్టోబర్ ఒకటో తేదీ వరకు వర్షాలు అనుకున్న స్థాయిలో కురిసి జలాశయాలు నిండితే వచ్చే వర్షాకాలం వరకు నగర వాసులకు సరిపడినంత నీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు చాలా తక్కువ స్థాయిలో కురవడంతో కార్పొరేషన్ జూలై 1వ తేదీ నుంచి 20 శాతం నీటి కోతలు విధించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఇదే నెల చివరిలో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో 10 శాతం నీటి కోతను తగ్గించామన్నారు. కాగా వాణిజ్య, పారిశ్రామిక భవనాల్లో మాత్రం 50 శాతం నీటి కోతను కొనసాగించామని తవాడియా పేర్కొన్నారు. ఇదిలా వుండగా, నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో ప్రస్తుతం 12.41 లక్షల మిలియన్ లీటర్ల నీరు అందుబాటులో ఉందన్నారు. కాగా, వచ్చే వర్షాకాలం వరకు నగరానికి రోజు నీటిని సరఫరా చేయడానికి 14.47 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కేవలం 288 రోజులకు సరిపడినంత నీరు ఉన్న మోదక్ సాగర్, మిడిల్, అప్పర్ వైతర్ణ జలాశయాల్లో నీరు గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం నగరానికి భాత్స జలాశయం నుంచి ఎక్కువ మోతాదులో నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో కూడా 227 రోజులకు సరిపడా నీరు ఉందని తివారి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో నీటిమట్టం ఓవర్ ఫ్లో మార్కు కన్నా కేవలం ఆరు మీటర్లు తక్కువగా ఉందన్నారు. కాగా మిడిల్ వైతర్ణలో కూడా ఓవర్ ఫ్లో మట్టానికి మూడు మీటర్లు తక్కువగా నీటిమట్టం నమోదైందని తెలిపారు.
నీటి కోతలు ఎత్తేస్తాం!
Published Wed, Aug 13 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement