town people
-
ఓ.. మై డాగ్!
సాక్షి, అమరావతి: కుక్కల్ని పెంచుకునే అలవాటు పూర్వం నుంచీ ఉన్నా.. గత కొన్నేళ్లుగా మరింత పెరుగుతోంది. ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు శునకాలను పెంచుకుంటుండగా.. మరికొందరు అభిరుచిగా స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఇంటి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రధాన నగరాల్లో పశువుల కంటే పెంపుడు కుక్కల సంఖ్యే అధికంగా ఉండటం విశేషం. వాటికి సీమంతం, బారసాల, పుట్టిన రోజు, వర్ధంతులు, జయంతులు నిర్వహించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరణించిన శునకాలకు సమాధులు, అక్కడక్కడా వాటి విగ్రహాలు ప్రతిష్టించడం కూడా కనిపిస్తోంది. ► శునకాలను పెంచేవారు వారి స్థాయిని.. వాటి రకాన్ని బట్టి బడ్జెట్లో నెలవారీ, వార్షిక కేటాయింపులు చేస్తున్నారు. ► ఒక్కో శునకానికి అవి తినే ఆహారాన్ని బట్టి నెలకు రూ.వెయ్యి నుంచి నుంచి రూ.10 వేల వరకు వెచ్చిస్తున్నారు. ► కుక్క జాతిని బట్టి పోషణకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ► టీకాలు, ఇతర మందులు, వైద్యానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు అవుతుంది. ఏవైనా పెద్ద జబ్బులు చేస్తే ఇంకాస్త ఎక్కువే ఖర్చవుతోంది. ► కాపలాకు, పోలీస్ పనులకు, అంధులకు దారి చూపేందుకు, మత్తు మందుల జాడ తెలుసుకునేందుకు డాబర్మెన్ను ఉపయోగిస్తారు. ► కాపలాకు గ్రెడెన్, అల్సేషన్ వంటి 13 రకాలను వినియోగిస్తారు. యజమానికి తోడు కోసం పమేరియన్, డాషాండ్ వంటి 16 రకాల శునకాలను వినియోగిస్తారు. ► కాపలాకు, పోలీసు పనులకు, తప్పిపోయిన వారి జాడ కనుగొనేందుకు రాట్ వీలర్, బెల్జియన్ టెర్వురెన్ను.. దొంగలు, తప్పిపోయిన వారి జాడ తెలుసుకునేందుకు బ్లడ్ హౌండ్ అనే జాతిని ఉపయోగిస్తారు. ► వేటకు, రక్షణకు ఐరిష్ వాటర్ స్పానియాల్, బోర్డర్ టెరియర్, పాయింటర్, గ్రేహౌండ్, సాలూకి వంటి జాతులను, వాసన పసిగట్టేందుకు ఇంగ్లిష్ సెట్టర్‌ను వినియోగిస్తారు. 350 జాతులు ► ‘టోమార్క్ టాస్’ అనే చిన్నపాటి జంతువులు శునక జాతికి పూర్వీకులని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ► ప్రపంచవ్యాప్తంగా 350 జాతులను అభివృద్ధి చేశారు. వీటిని స్పోర్టింగ్, హౌండ్, వర్కింగ్, ట్రేయర్, టాయ్, నాన్ స్పోర్టింగ్, ఫిష్ హార్డింగ్ అనే 7 గ్రూపులుగా విభజించారు. వీటిలో 38 జాతులు మన దేశంలో ఉన్నాయి. ► పాయింటర్, ఇంగ్లిష్ సెట్టర్, లేబ్రడార్, ఐరిష్ వాటర్ స్పానియాల్, కాకర్ స్పానియాల్, గ్రేహౌండ్, ఆప్ఘన్ హౌండ్, సాలూకి, బ్లడ్ హౌండ్, డాషాండ్, మాస్టిఫ్, గ్రేట్ డెన్, డాబర్‌మెన్, బుల్ మాస్టిఫ్, రాట్ వీలర్, ఎయిర్ డేర్ టెరియర్, బుల్ టెరియర్, స్కాటిష్ టెరియర్, బోర్డర్ టెరియర్, నార్విచ్ టెరియర్, పగ్, పమేరియన్, పెకింగిస్, మాల్టిసి, చిహు అహువా, కిషాండ్, డాల్మేషియన్, బుల్ డాగ్, చౌచౌ, బోస్టన్ టెరియర్, బెల్జియన్ టెర్వురెన్, బోర్డర్ కూలీ, బ్రియార్డ్, రఫ్ కూలీ, అల్సేషియన్, బాక్సర్, గోల్డెన్ రిట్రైవర్, లసోప్సో వంటి విదేశీ కుక్క జాతులు మన దేశంలో ఉన్నాయి. ► రాజుపాళ్యం, చిట్టి తారి అనే స్థానిక జాతులూ ఉన్నాయి. -
ఇది ఆ ఊరి విజయం!
‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా’ అన్నాడో కవి. పాపం ఆ వాస్తవం తెలియక ఆ గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మోసపోయారు. హర్యానా రాష్ట్రంలోని సిర్స జిల్లాలో, గగ్గర్ నది ఒడ్డున ఉంది పనిహరి గ్రామం. ఆ ఊరి వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా గగ్గర్ నదిని దాటాలి. కానీ అదంత తేలిక కాదు. దాన్ని దాటే క్రమంలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఎందరో తమ వారిని పోగొట్టుకుని అల్లాడారు. దాంతో ఆ నదిమీద వంతెన కట్టమంటూ ఊరి ప్రజలు జిల్లా అధికారులను ఆశ్రయించారు. కానీ వాళ్లు ఆ విషయం పట్టించుకోలేదు. అడిగినప్పుడల్లా ‘చూద్దాం’ అనేవారు. అలా యేళ్లు గడిచి పోయాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. దాంతో విసుగెత్తిన గ్రామ ప్రజలు రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వారూ అంతే. ‘తప్పకుండా చేద్దాం’ అనేవారు తప్ప చేసేవారు కాదు. అధికారులు, రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలేనని తెలుసుకోవ డానికి చాలా సమయం పట్టింది పాపం అమాయకులైన ఆ గ్రామస్తులకు. అయితే అంతలోనే మరో దుర్ఘటన జరిగింది. ఇరవై సంవత్సరాల సన్నీ అనే యువకుడు నాలుగు సంవత్సరాల మనీష్‌తో కలసి నది పక్కనున్న గట్టుమీద సైకిల్‌పై వెళ్తూ అదుపు తప్పాడు. ఇద్దరూ నదిలో పడిపో యారు. ఈత రావడం వల్ల సన్నీ బతికి పోయాడు. మనీష్ చనిపోయాడు. ఆ చిన్నారి మరణం ఊరిని కుదిపేసింది. గతంలో కూడా ఒకసారి ట్రాక్టర్ బోల్తా పడి పన్నెండు సంవత్సరాల అమ్మాయి, రెండు సంవత్సరాల అబ్బాయి చనిపోయారు. అవన్నీ గుర్తొచ్చి వారి మనసులు అల్లాడిపోయాయి. ఇక ఆ నది ఎవరినీ బలి తీసుకోవడానికి వీల్లేదు అనుకున్నారు గట్టిగా. అనుకున్నదే తడవుగా గగ్గర్ నదికి సమీపంలో ఉన్న మహంత్ బ్రహ్మదాస్ ఆశ్రమానికి వెళ్లారు. నలభై రెండు సంవత్సరాల బ్రహ్మదాస్ తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలను ప్రభావితం చేస్తుంటారు. ఆయన గ్రామస్తుల బాధను అర్థం చేసుకున్నారు. ‘‘ప్రజలు తలచుకోవాలేగానీ అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు. ఈ బ్రిడ్జి కూడా అంతే. కులం, మతం, రాజకీయం అన్నింటినీ పక్కనబెట్టి బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుందాం’’ అన్నారు బ్రహ్మదాస్. ఆయన మాటలు ప్రజలను ఉత్తేజితులను చేశాయి. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు బ్రహ్మదాస్. తనవంతుగా ఆశ్రమం తరపున కొన్ని లక్షలు ఇచ్చారు. మొదటి అడుగు పడింది. ఇరవై అయిదు మందితో ఒక కమిటీ ఏర్పాటు అయింది. నిధుల సేకరణ మొదలైంది. పనిహరి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా తమ వంతుగా సహాయం చేశారు. పది రూపాయల నుంచి పదివేల వరకు ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారు. పొరుగు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఒకరు లక్షా ఇరవై వేలు బ్రిడ్జి కోసం ఇచ్చాడు. దాంతో మార్గం సుగమమైంది. గత సంవత్సరం వైశాఖి పండుగరోజు వంతెన నిర్మాణానికి పునాదిరాయి పడింది. అయితే అంతో ఇంకో చిన్న చిక్కు వచ్చింది. వంతెన నిర్మాణానికి అయ్యే వ్యయం ఒక కోటీ అయిదు లక్షల రూపాయలుగా ఇద్దరు సివిల్ ఇంజినీర్లు అంచనా వేశారు. అయితే అప్పటికి కమిటీ దగ్గర 90 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా సొమ్ము సమకూర్చు కుంటేగానీ వంతెన నిర్మాణం పూర్తి కాదు. ఎలా అంటూ టెన్షన్ పడ్డారు. కానీ ఊహించని విధంగా మరికొందరు దాతలు ముందుకొచ్చారు. దాంతో మిగతా సొమ్ము కూడా చేతికొచ్చింది. ప్రజలు కేవలం డబ్బును మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. శ్రమదానం కూడా చేశారు. అవసరమైన వస్తువులు కూడా ఇచ్చారు. కొందరు రైతులు మట్టిని దానం చేశారు. అందరూ ఇలా తలో చెయ్యీ వేయడంతో వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పనిహరి గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టు పక్కల 35 గ్రామాల ప్రజలకు మేలు జరిగింది. పూర్తిగా ప్రజల సహాయ సహకారాలు, రెక్కల కష్టంతో నిర్మితమైన ఈ వంతెనకు ‘ప్రజా వారధి’ అని పేరు పెట్టారు. ‘‘ఒకప్పుడు పిల్లలు బడికి సమయా నికి వెళ్లలేకపోయేవారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇప్పుడు సకాలంలో చేరుకోగలుగు తున్నారు’’ అంటున్నారు కమిటీ అధ్య క్షుడు మంజీందర్ సింగ్. ఈ ఆనందాన్ని తమకు అందించిన బ్రహ్మదాస్‌కు కృత జ్ఞతలు చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ‘‘ఇందులో నా గొప్ప దనం ఏం లేదు. ప్రజల సంకల్పబలం ఎంత గొప్పదో చెప్ప డానికి ఈ వంతెన బలమైన ఉదాహరణ’’ అంటున్నారు. ఆయన ప్రోత్సాహం, ఊరి ప్రజల కష్టం ప్రజావారధికి ప్రాణం పోశాయి. ఈ విజయం ఏ ఒక్క వ్యక్తిదో కాదు.. మొత్తం ఊరుది! -
నీటి కోతలు ఎత్తేస్తాం!
సాక్షి, ముంబై : నగర వాసులకు ఓ శుభవార్త! నగర ప్రజలు కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న నీటి కోతలు త్వరలోనే ఎత్తివేయనున్నారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది. కాగా, నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా పెరగడంతో బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేషన్ డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ తవాడియా కోతలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోని నీటిమట్టం పెరిగిందని తెలిపారు. జూన్, జూలైలో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగైంద న్నారు. ప్రస్తుతం నీటి నిలువలు నగరవాసులకు సరిపడినంతగా ఉన్నాయని , దీంతో నీటికోతను ఎత్తివేయాలని నిశ్చయించుకున్నామని ఆయన పేర్కొన్నారు.అక్టోబర్ ఒకటో తేదీ వరకు వర్షాలు అనుకున్న స్థాయిలో కురిసి జలాశయాలు నిండితే వచ్చే వర్షాకాలం వరకు నగర వాసులకు సరిపడినంత నీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు చాలా తక్కువ స్థాయిలో కురవడంతో కార్పొరేషన్ జూలై 1వ తేదీ నుంచి 20 శాతం నీటి కోతలు విధించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఇదే నెల చివరిలో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో 10 శాతం నీటి కోతను తగ్గించామన్నారు. కాగా వాణిజ్య, పారిశ్రామిక భవనాల్లో మాత్రం 50 శాతం నీటి కోతను కొనసాగించామని తవాడియా పేర్కొన్నారు. ఇదిలా వుండగా, నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో ప్రస్తుతం 12.41 లక్షల మిలియన్ లీటర్ల నీరు అందుబాటులో ఉందన్నారు. కాగా, వచ్చే వర్షాకాలం వరకు నగరానికి రోజు నీటిని సరఫరా చేయడానికి 14.47 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం 288 రోజులకు సరిపడినంత నీరు ఉన్న మోదక్ సాగర్, మిడిల్, అప్పర్ వైతర్ణ జలాశయాల్లో నీరు గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం నగరానికి భాత్స జలాశయం నుంచి ఎక్కువ మోతాదులో నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో కూడా 227 రోజులకు సరిపడా నీరు ఉందని తివారి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో నీటిమట్టం ఓవర్ ఫ్లో మార్కు కన్నా కేవలం ఆరు మీటర్లు తక్కువగా ఉందన్నారు. కాగా మిడిల్ వైతర్ణలో కూడా ఓవర్ ఫ్లో మట్టానికి మూడు మీటర్లు తక్కువగా నీటిమట్టం నమోదైందని తెలిపారు.