ఇది ఆ ఊరి విజయం! | It was the success of the village! | Sakshi
Sakshi News home page

ఇది ఆ ఊరి విజయం!

Published Sun, Aug 23 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

ఒకే ఊరు - ఒకే మాట: పనిహరి గ్రామస్తులు

ఒకే ఊరు - ఒకే మాట: పనిహరి గ్రామస్తులు

‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా’ అన్నాడో కవి. పాపం ఆ వాస్తవం తెలియక ఆ గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మోసపోయారు. హర్యానా రాష్ట్రంలోని సిర్స జిల్లాలో, గగ్గర్ నది ఒడ్డున ఉంది పనిహరి గ్రామం. ఆ ఊరి వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా గగ్గర్ నదిని దాటాలి. కానీ అదంత తేలిక కాదు. దాన్ని దాటే క్రమంలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఎందరో తమ వారిని పోగొట్టుకుని అల్లాడారు. దాంతో ఆ నదిమీద వంతెన కట్టమంటూ ఊరి ప్రజలు జిల్లా అధికారులను ఆశ్రయించారు.

కానీ వాళ్లు ఆ విషయం పట్టించుకోలేదు. అడిగినప్పుడల్లా ‘చూద్దాం’ అనేవారు. అలా యేళ్లు గడిచి పోయాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. దాంతో విసుగెత్తిన గ్రామ ప్రజలు రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వారూ అంతే. ‘తప్పకుండా చేద్దాం’ అనేవారు తప్ప చేసేవారు కాదు. అధికారులు, రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలేనని తెలుసుకోవ డానికి చాలా సమయం పట్టింది పాపం అమాయకులైన ఆ గ్రామస్తులకు. అయితే అంతలోనే మరో దుర్ఘటన జరిగింది.  

ఇరవై సంవత్సరాల సన్నీ అనే యువకుడు నాలుగు సంవత్సరాల మనీష్‌తో కలసి నది పక్కనున్న గట్టుమీద సైకిల్‌పై వెళ్తూ అదుపు తప్పాడు. ఇద్దరూ నదిలో పడిపో యారు. ఈత రావడం వల్ల సన్నీ బతికి పోయాడు. మనీష్ చనిపోయాడు. ఆ చిన్నారి మరణం ఊరిని కుదిపేసింది. గతంలో కూడా ఒకసారి ట్రాక్టర్ బోల్తా పడి పన్నెండు సంవత్సరాల అమ్మాయి, రెండు సంవత్సరాల అబ్బాయి చనిపోయారు. అవన్నీ గుర్తొచ్చి వారి మనసులు అల్లాడిపోయాయి.  ఇక ఆ నది ఎవరినీ బలి తీసుకోవడానికి వీల్లేదు అనుకున్నారు గట్టిగా. అనుకున్నదే తడవుగా గగ్గర్ నదికి సమీపంలో ఉన్న మహంత్ బ్రహ్మదాస్ ఆశ్రమానికి వెళ్లారు.
 
నలభై రెండు సంవత్సరాల బ్రహ్మదాస్ తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలను ప్రభావితం చేస్తుంటారు. ఆయన గ్రామస్తుల బాధను అర్థం చేసుకున్నారు. ‘‘ప్రజలు తలచుకోవాలేగానీ అసాధ్యమైన పని  అంటూ ఏదీ లేదు. ఈ బ్రిడ్జి కూడా అంతే. కులం, మతం, రాజకీయం అన్నింటినీ పక్కనబెట్టి బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుందాం’’ అన్నారు  బ్రహ్మదాస్.
 
ఆయన మాటలు ప్రజలను ఉత్తేజితులను చేశాయి. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు బ్రహ్మదాస్. తనవంతుగా ఆశ్రమం తరపున కొన్ని లక్షలు ఇచ్చారు. మొదటి అడుగు పడింది. ఇరవై అయిదు మందితో ఒక కమిటీ ఏర్పాటు అయింది. నిధుల సేకరణ మొదలైంది. పనిహరి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా తమ వంతుగా సహాయం చేశారు. పది రూపాయల నుంచి పదివేల వరకు ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారు. పొరుగు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఒకరు లక్షా ఇరవై వేలు బ్రిడ్జి కోసం ఇచ్చాడు. దాంతో మార్గం సుగమమైంది. గత సంవత్సరం వైశాఖి పండుగరోజు వంతెన నిర్మాణానికి పునాదిరాయి పడింది.
 
అయితే అంతో ఇంకో చిన్న చిక్కు వచ్చింది. వంతెన నిర్మాణానికి అయ్యే వ్యయం ఒక కోటీ అయిదు లక్షల రూపాయలుగా ఇద్దరు సివిల్ ఇంజినీర్లు అంచనా వేశారు. అయితే అప్పటికి కమిటీ దగ్గర 90 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా సొమ్ము సమకూర్చు కుంటేగానీ వంతెన నిర్మాణం పూర్తి కాదు. ఎలా అంటూ టెన్షన్ పడ్డారు. కానీ ఊహించని విధంగా మరికొందరు దాతలు ముందుకొచ్చారు. దాంతో మిగతా సొమ్ము కూడా చేతికొచ్చింది.
 
ప్రజలు కేవలం డబ్బును మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. శ్రమదానం కూడా చేశారు. అవసరమైన వస్తువులు కూడా ఇచ్చారు. కొందరు రైతులు మట్టిని దానం చేశారు. అందరూ ఇలా తలో చెయ్యీ వేయడంతో వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పనిహరి గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టు పక్కల 35 గ్రామాల ప్రజలకు మేలు జరిగింది. పూర్తిగా ప్రజల సహాయ సహకారాలు, రెక్కల కష్టంతో నిర్మితమైన ఈ వంతెనకు ‘ప్రజా వారధి’ అని పేరు పెట్టారు.
 
‘‘ఒకప్పుడు పిల్లలు బడికి సమయా నికి వెళ్లలేకపోయేవారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇప్పుడు సకాలంలో చేరుకోగలుగు తున్నారు’’ అంటున్నారు కమిటీ అధ్య క్షుడు మంజీందర్ సింగ్. ఈ ఆనందాన్ని తమకు అందించిన బ్రహ్మదాస్‌కు కృత జ్ఞతలు చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ‘‘ఇందులో నా గొప్ప దనం ఏం లేదు. ప్రజల సంకల్పబలం ఎంత గొప్పదో చెప్ప డానికి ఈ వంతెన బలమైన ఉదాహరణ’’ అంటున్నారు. ఆయన ప్రోత్సాహం, ఊరి ప్రజల కష్టం ప్రజావారధికి ప్రాణం పోశాయి. ఈ విజయం ఏ ఒక్క వ్యక్తిదో కాదు.. మొత్తం ఊరుది!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement