నీటి వెతలు షరామామూలే
- రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు
- నీటికోతలు తగ్గించలేమంటున్న అధికారులు
-వారం, పదిరోజులు భారీవర్షాలు పడితే తప్ప పరిస్థితి మారదని స్పష్టీకరణ
సాక్షి, ముంబై: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరంలో అమలవుతున్న నీటికోతపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనిపించడంలేదు. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలవల్ల నగరానికి నీటి సరఫరాచేసే కొన్ని జలాశయాల్లో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ఇది ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ఈ వర్షంవల్ల నగర ప్రజలకు ఒరిగేదిమి లేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్పష్టం చేసింది.
మరో వారం, పది రోజులు తె రిపిలేకుండా భారీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి గాడిన పడే సూచనలు లేవని బీఎంసీ నీటిసరఫరా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ వానలు పత్తాలేకుండా పోయాయి. మరోపక్క జలాశయాలు అడుగంటసాగాయి. దీంతో గత్యంతరం లేక నగర ప్రజలకు నీటి కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఎప్పటి నుంచి, ఎంతమేర విధించాలనే దానిపై కొద్దిరోజులుగా తర్జనభర్జన పడసాగారు. ఎట్టకేలకు బుధవారం నుంచి 20 శాతం నీటి కోత అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
అంతకుముందే అనధికారికంగా ఐదు శాతం నీటి కోత విధిస్తున్నారు. దీంతో మొత్తం 25 శాతం నీటి కోత అమలులో ఉంది. కాని బుధవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ గురువారం భారీ వర్షమేమీ పడలేదు. నగర, శివారు ప్రాంత పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. కాని జలాశయాల పరిసరా ప్రాంతాల్లో స్వల్పంగా పడింది. జలాశయాల్లో తగినంత నీటి మట్టం పెరిగేంత వరకు కోత తప్పదని అంటున్నారు.
2013 జూలై మూడో తేదీన 4,51,793 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండగా, ఈ ఏడాది జూలై మూడో తేదీన 1,09,241 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీన్ని బట్టి జలాశయాల్లో ఈ ఏడాది నీటిమట్టం ఏ స్థాయికి పడిపోయిందో తెలుస్తోంది. నగరానికి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల పరిసరాల్లో గురువారం సాయంత్రం వరకు తులసీ డ్యాంవద్ద అధికంగా 191 మి.మీ. వర్షం కురిసింది.
విహార్ పరిసరాల్లో 176, భాత్సా-16, మోడక్‌సాగర్-4.60, తాన్సా-4, అప్పర్ వైతర్ణ-0.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. కాని ఎక్కడా భారీవర్షం నమోదు కాలేదు. రెండు రోజులుగా వాతావరణం కొంత చల్లబడడంతో ప్రజలు ఊపిరీపీల్చుకున్నారు. కాని శుక్రవారం పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఉక్కపోత ప్రజలను తిరిగి విసిగించింది.