
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
మరాఠ్వాడాలో వర్ష బీభత్సం
- వరదల్లో చిక్కుకుని ఐదుగురు మృతి
- ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు అంతరాయం
- మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ
సాక్షి, ముంబై: కొన్నేళ్లుగా కరవు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడా ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విదర్భలోని వర్ధా, యవత్మాల్, అమరావతి, అకోలా, బుల్డాణ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
యవత్మాల్ జిల్లాలో వర్ధా నది పొంగి ప్రవహిస్తోంది. నాసిక్, జల్గావ్ జిల్లాల్లోని భుసావల్, ముక్తాయినగర్, రావేర ప్రాంతాల్లో వర్షపు నీరు వరదలై పారుతోంది. యవత్మాల్‌లో నలుగురు, జల్గావ్‌లో ఒకరు మృతిచెందారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడచినా చినుకు జాడ లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన గురయ్యారు. ఈ ఏడాది కూడా పంటలు ఎండిపోతాయేమో అని కలవరపడ్డారు. మరాఠ్వాడా రీజియన్‌లో ఉన్న మొత్తం 76 తాలూకాలకు గాను 72 చోట్ల వర్షాలు ఆశించినంత మేర కురుస్తున్నాయి. దీంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
నలుగురు గల్లంతు
తాపీ నది పొంగి పొర్లుతుండటంతో హత్నూర్ డ్యాం 41 గేట్లు ఎత్తివేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి ఆర్వీ-యవత్మాల్ రహదారిపై బిల్దోరి వంతెనపై వెళుతున్న ఆల్టో కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు గురువారం ఉదయం బిల్దోరి వంతెనకు రెండు కి.మీ. దూరంలో కారు, నలుగురి మృతదేహాలు లభించాయి. మృతుల్లో యవత్మాల్‌లోని ప్రగతి నగర్‌కు చెందిన సంజయ్, గజానన్, గాయత్రి, శ్రావణి ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. యవత్మాల్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు.
కొట్టుకుపోయిన రహదారులు
భారీ వర్షాల ధాటికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. వందలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చెట్లు నేల కూలడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో జలమయమైన గ్రామ ప్రజలకు సహాయం అందించేందుకు ఆలస్యం అవుతోంది. వరదల ధాటికి జల్గావ్ జిల్లాలో పొలానికి వెళ్లిన శ్యామ్‌బాయి మహాజన్ అనే మహిళ నీటిలో కొట్టుకుపోయింది. గురువారం ఉదయం శవాన్ని వెలికి తీశారు. మరో రెండు, మూడు రోజులు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.