సర్కారుపై సమరం
► ప్రభుత్వ చేతకానితనం వల్లే కరువు
► సర్కారు తీరుకు నిరసనగా నేడు ఖాళీ బిందెలతో ప్రదర్శన
► వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి వెల్లడి.
విజయవాడ (మధురానగర్) : రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే నేడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. కరువు నివారణకు సర్కారు తీసుకున్న చర్యలు శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఖాళీ బిందెలతో ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విజయవాడ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.
స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమను కోనసీమగా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉభయ గోదావరి, కృష్ణా తదితర ప్రాంతాలు ఎడారిగా మారుతున్నా పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఒక్కసారి కూడా కంటింజెన్సీ ప్లాన్ చేయకపోవటం, కనీసం మంత్రివర్గం చర్చించకపోవటం ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చులకనభావాన్ని తెలియజేస్తోందన్నారు.
కరువు, తాగునీరు, సాగునీటి సమస్యలపై కనీసం చర్చించని ప్రభుత్వం ఇసుక, పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెట్టే వ్యవహారాలపై మాత్రం పలుమార్లు చర్చించటం గమనార్హమన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి రాష్ట్రంలో నెలకొన్న కరువుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్కరూ కలిసి రావాలి...
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న రాష్ట్రవ్యాప్త పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సారథి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభించనున్నట్లు చెప్పారు. అర్బన్ తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్న అనంతరం అక్కడ ధర్నా నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి...
వైఎస్సార్‌సీపీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రెండో తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు, తలశిల రఘురామ్, కార్పొరేటర్లు కె.కాశి, వీరమాచినేని లలిత, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ, నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి, యువజన విభాగం నాయకుడు కాజ రాజ్‌కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాస్, నగర వాణిజ్య విభాగం క న్వీనర్ కొణిజేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.