సమస్యలు వినిపించేనా?
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
► ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా?
► కరువు కోరల్లో పాలమూరు
► గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి
► గ్రాసం లేక కబేళాలకు పశువులు
► విపక్షసభ్యులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది.. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేత కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ఏడాది సరైన వర్షాల్లేక కృష్ణా, తుంగభద్ర నదులు ఎండిపోయాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కరువు సహాయకచర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు.. ఇలా అనేక సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
కరువుపై నిలదీయనున్న ప్రతిపక్షాలు
జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా అలుముకున్నాయని ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులు చెబుతున్నారు. కరువుపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకపక్షాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్‌రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఏ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు ప్రజాసమస్యలపై స్పందించడం లేదని ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీపీ కార్యాలయాల్లో జెడ్పీటీలకు ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తీర్మానించినా ఎక్కడా అమలుకాలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
గత సమావేశాల తీరిది..
ప్రస్తుత జెడ్పీ పాలకమండలి 2014 జులై 5న కొలువుదీరింది. ఇప్పటివరకు 8సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈనెల 20న మరోసారి సమావేశం జరగనుంది. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో ప్రొటోకాల్ వివాదం, జూరాల- పాకాల పథకానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు అధికారులు తమను ఆహ్వానించడం లేదని అధికార, ప్రతిపక్షాల జెడ్పీటీసీలు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు ప్రత్యేకగదిని కేటాయించాలని ఎంపీపీలు డిమాండ్ చేస్తున్నారు. గత మే 23వ తేదీన ప్రత్యేకంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సారి కేవలం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎలా నిర్వహించాలనే అంశంపైనే చర్చించారు. సెప్టెంబర్ 4న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. జనవరి 4న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, కాంగ్రెస్ ఎంపీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమావేశంలో గొడవతోనే సరిపోయింది. జెడ్పీ నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించొద్దని జెడ్పీటీసీలు, ఆ నిధులను తమకు కేటాయించాలని ఎంపీపీలు.. ఇలా అనే డిమాండ్లతో సభ గందరగోళంగా మారింది.
ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామ్యాపై చర్చించే అవకాశం
నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీటి సరఫరా, ఉపాధిహామీ పథకాలపైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సమావేశంలో కూడా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అప్పట్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరుచేసిందని మంత్రి ప్రకటించారు. ఆ చర్యలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.
ఎజెండాలు సమర్పించని 19 శాఖలు
జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 19శాఖలు తమ శాఖలో చేపట్టిన పూర్తి వివరాలను ఎజెండాలో సమర్పించలేదు. మొత్తం 64 శాఖలకు గాను 19శాఖలు ఇవ్వలేదు. మత్స్యశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, సివిల్‌సప్లయి, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్‌శాఖ వారు తమ ప్రగతి సమాచారాన్ని జెడ్పీ ఎజెండాకు సమర్పించలేదు. నివేదిక సమర్పించని శాఖలను ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీటీసీలు నిలదీస్తున్నారు. ఈ సారైన నివేదికలను సమర్పించని శాఖలను ప్రశ్నిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది.