ఖరీఫ్.. కటీఫ్..! | farmers in concern on kharif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్.. కటీఫ్..!

Published Sat, Jul 26 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

farmers in concern on kharif season

గద్వాల : ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన మేరకు వర్షాలు రాకపోవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లోకి వరద నీరు రాలేదు. దీంతో ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లందించే పాత ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల పరిధిలో రైతులకు కన్నీళ్లు తప్పేట్లు లేవు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురిసి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్న ఆశతో ఆయకట్టు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు.

ఆగస్టు మొదటివారం నాటికి నీళ్లు వస్తే నాట్లు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ, ఇప్పటివరకు ఆల్మట్టికే నీరు సగానికి మించి చేరలేదు. క ృష్ణా, తుంగభద్ర నదులకు కూడా నీటి రాక ప్రారంభం కాలేదు. నీటిరాక ఇంకా ఆలస్యమైతే వరినార్లు ముదిరి సాగుకు పనికిరాకుండా పోతాయన్న ఆందోళనలో రైతులున్నారు. ఒకవేళ ఆలస్యంగా సాగుచేసినా దిగుబడులు దారుణంగా పడిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు.

 నార్లు సిద్ధం చేసుకున్న అన్నదాతలు
 ఖరీఫ్‌లో ప్రస్తుతం ఉన్న జూరాల ఆర్డీఎస్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో  రైతులు ఇప్పటికే  లక్షా 75వేల ఎకరాలకు సరిపోను నార్లు సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మొదటిసారిగా కొత్త ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్‌కు సాగునీటిని అం దిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినందున భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిధిలో లక్షా 55వేల ఎకరాల్లో సాగు చేసుకునేం దుకు రైతులు ఎదురుచూస్తున్నారు. పాత, కొత్త ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖరీఫ్‌లో దాదాపు 3.22లక్షల ఎకరాలలో సాగునీటిని అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద రాకపోవడం రైతులను అయోమయంలోకి నెట్టేసింది.

 జూరాలకు నేటికీ చేరని వరద...
 కృష్ణానదిపై కర్ణాటకలో మొదటి ప్రాజెక్టుగా ఉన్న ఆల్మట్టి రిజర్వాయర్ 129 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండగా వారం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో కేవలం 50 టీఎంసీలకు మాత్రమే నీటినిల్వ చేరింది. ఇంకా 60 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చి చేరితేనే దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇప్పటి వరకు వరద ప్రారంభం కాలేదు.

 ఇక కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వరద రాకపోవడంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఖరీఫ్ సాగుకు నీటిని అందించే పరిస్థితులు కనిపించడం లేదు. తుంగభద్ర రిజర్వాయర్‌కు నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 45 టీఎంసీల నీటినిల్వ చేరింది. ఈ ప్రాజెక్టు నుంచి ఎప్పటికి నీటి విడుదల జరుగుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement